రాజ్‌భవన్‌లో రాస‌లీల‌లు

Rasilalas at Raj Bhavan– పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌పై లైంగిక ఆరోపణలు
– మహిళా ఉద్యోగి అభియోగం
– తోసిపుచ్చిన సీ.వీ ఆనంద బోస్‌
– గవర్నర్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆగ్రహం
– ప్రధానిని ప్రశ్నించిన నేతలు
– నేడు పర్యటన.. గురువారమే రాజ్‌భవన్‌కు మోడీ
కోల్‌కతా : ప్రధాని మోడీ పర్యటనకు ఒక రోజు ముందు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర గవర్నర్‌ సీ.వీ ఆనంద బోస్‌పై లైంగిక ఆరోపణలు కలకలం రేపాయి. రాజ్‌భవన్‌లో ఒక మహిళా ఉద్యోగి రాష్ట్ర గవర్నర్‌ తనను వేధించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను రాజ్‌భవన్‌ వర్గాలు, గవర్నర్‌ ఖండించారు. రాజ్‌భవన్‌ ఆవరణలోని క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న మహిళ ముందుగా రాజ్‌భవన్‌ అవుట్‌పోస్టు వద్దకు చేరుకున్నది. ఆ తర్వాత అక్కడి నుంచి హేర్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో రాష్ట్ర పోలీసులు ఆ మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.. అయితే ఈ విషయంలో ఇంకా ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 361 ప్రకారం పదవిలో ఉన్నప్పుడు గవర్నర్‌ క్రిమినల్‌ ప్రొసీడింగ్‌ల నుంచి మినహాయింపు పొందుతాడు. అయితే, ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), బీజేపీల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. కాగా, గవర్నర్‌పై లైంగిక ఆరోపణల అంశాన్ని టీఎంసీ నేతలు సామాజిక మాధ్యమాల్లోకి లాగారు. ”బెంగాల్‌ గవర్నర్‌పై వేధింపుల ఆరోపణలు కోల్‌కతాలోని రాజ్‌భవన్‌ ప్రతిష్టను ఫణంగా పెట్టాయి. ప్రధాని మోడీ గురువారమే కోల్‌కతా చేరుకుని రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేశారు. మోడీ.. సీ.వీ ఆనంద బోస్‌ను వివరణ అడుగుతారా?” అని టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్‌ ‘ఎక్స్‌’ పోస్ట్‌లో పేర్కొన్నారు.
కాగా, ఆ మహిళ తన ఫిర్యాదులో రెండు విషయాలను ప్రస్తావించారు. ఒకటి ఏప్రిల్‌ 24న, మరొకటి గురువారం. రాజ్‌భవన్‌లో కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న ఆమె.. స్టాఫ్‌ క్వార్టర్స్‌లో నివసిస్తున్నది. గతనెల 19న తన రెస్యుమెతో తనను కలవాల్సిందిగా గవర్నర్‌ తనను కోరినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ”24న మధ్యాహ్నం 12.45 గంటలకు, అతను నన్ను తన ఆఫీసు గదికి పిలిచారు. కొంత చర్చ తర్వాత నన్ను హత్తుకున్నారు. నేను ఎలాగోలా ఆఫీస్‌ రూమ్‌ నుంచి బయటకి వచ్చాను. అతను ఏప్రిల్‌ 24న, ఈ నెల 2న మరోసారి నాకు కాల్‌ చేశారు. నేను భయపడి నా సూపర్‌వైజర్‌ని నాతో పాటు సమావేశ గదికి తీసుకెళ్లాను. పని గురించి కాసేపు మాట్లాడిన తర్వాత సూపర్‌వైజర్‌ని వెళ్లిపొమ్మన్నారు. అతను నా ప్రమోషన్‌ గురించి మాట్లాడుతూ సంభాషణను పొడిగించారు. రాత్రికి ఫోన్‌ చేస్తానని, ఎవరికీ చెప్పవద్దన్నారు. నేను నిరాకరించటంతో.. ఆయన నన్ను తాకటానికి ప్రయత్నించారు. నేను అభ్యంతరం తెలిపి వెళ్లిపోయా” అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నది.
ఈ ఘటనపై రాష్ట్ర ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య ఆందోళన వ్యక్తం చేశారు. ”ఈ రాత్రికి ప్రధాని వచ్చి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. ఈ సమయంలో, ఒక మహిళపై అఘాయిత్యానికి పాల్పడినట్టు గవర్నర్‌పై ఆరోపణ ఉన్నది. ఇది సిగ్గుచేటు” అని ఆమె చెప్పారు. కాగా, గవర్నర్‌పై పరువు నష్టం, రాజ్యాంగ వ్యతిరేక మీడియా ప్రకటనలను పేర్కొంటూ కోల్‌కతా, డార్జిలింగ్‌, బరాక్‌పూర్‌లోని రాజ్‌భవన్‌ ప్రాంగణంలోకి మంత్రి చంద్రిమా భట్టాచార్య ప్రవేశాన్ని నిషేధిస్తూ రాజ్‌భవన్‌ గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. మంత్రి హాజరయ్యే ఏ కార్యక్రమంలోనూ తాను పాల్గొనబోనని గవర్నర్‌ ప్రకటించారు. మంత్రిపై తదుపరి చట్టపరమైన చర్యల కోసం భారత అటార్నీ జనరల్‌ను సంప్రదించారు. అలాగే, ఎన్నికల సమయంలో అనధికారికంగా దర్యాప్తు చేస్తున్నారనే నెపంతో పోలీసులు రాజ్‌భవన్‌లోకి ప్రవేశించకుండా నిషేధించారు. పశ్చిమ బెంగాల్‌ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శశి పంజా గవర్నర్‌ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బెంగాల్‌లో తన ర్యాలీల సందర్భంగా ప్రధాని ఈ అంశంపై స్పందించాలని కోరారు. గవర్నర్‌ చర్యలు సిగ్గుచేటని అన్నారు.
ఖండించిన గవర్నర్‌
గవర్నర్‌ సి.వి ఆనంద బోస్‌.. ఈ ఆరోపణలను ఖండించారు. ”సత్యం విజయం సాధిస్తుంది. ఇలాంటి కథనాలకు భయపడను” అని అన్నారు. ”ఎవరైనా నన్ను కించపరచటం ద్వారా ఎన్నికల ప్రయోజనాలను కోరుకుంటే, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. కానీ బెంగాల్‌లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా నా పోరాటాన్ని వారు ఆపలేరు” అని ఆయన అన్నారు. ఈ పరిణామం ప్రధాని పశ్చిమ బెంగాల్‌ పర్యటనకు ముందే చోటు చేసుకోవటం బీజేపీని ఇరుకున పెట్టిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. శుక్రవారం కృష్ణానగర్‌, బోల్పూర్‌, బీర్భూమ్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొననున్న ఆయన.. రాత్రి బస చేయటం కోసం గురువారం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.

Spread the love