Wednesday, May 27, 2026
E-PAPER
Homeఆటలుఆర్సీబీ అడుగేసింది

ఆర్సీబీ అడుగేసింది

- Advertisement -

ఫైనల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
గుజరాత్ టైటాన్స్‌పై 92తో ఘన విజయం
బెంగళూరు 254/5 గుజరాత్‌ 162/10

డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌19 ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్‌1లో గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ వరుసగా రెండో సీజన్లో టైటిల్‌ పోరుకు చేరుకుంది. రజత్ పటీదార్‌ (93 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో దుమ్మరేపగా తొలుత బెంగళూరు 254 పరుగుల భారీ స్కోరు చేసింది. పేసర్‌ జాకబ్‌ డఫ్ఫీ (3/39) వికెట్ల వేటలో నిప్పులు చెరగటంతో గుజరాత్‌ టైటాన్స్‌ ఛేదనలో చతికిల పడింది. టైటాన్స్‌ 162 పరుగులకే కుప్పకూలగా ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

నవతెలంగాణ-ధర్మశాల
డిఫెండింగ్‌ చాంపియన్‌ దుమ్మురేపింది. గుజరాత్‌ టైటాన్స్‌పై 92 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌19 ఫైనల్లో అడుగుపెట్టింది. 255 పరుగుల ఛేదనలో గుజరాత్‌ టైటాన్స్‌ 19.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ పేసర్లు పంజా విసరటంతో ఓ దశలో 88/8తో వందలోపే కుప్పకూలే ప్రమాదంలో పడిన గుజరాత్‌ టైటాన్స్‌ను రాహుల్‌ తెవాటియ (68, 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో ముందుకు తీసుకెళ్లాడు. ఓటమి ఖరారైన మ్యాచ్‌లో టైటాన్స్‌కు తెవాటియ గౌరవప్రద స్కోరు అందించాడు. జాకబ్‌ డఫ్ఫీ (3/39) మూడు వికెట్లతో టైటాన్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కకావికలం చేశాడు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగులు చేసింది. కెప్టెన్‌ రజత్‌ పటీదార్ (93 నాటౌట్, 33 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. విరాట్‌ కోహ్లి (43, 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), కృనాల్‌ పాండ్య (43, 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. విధ్వంసక బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షం చేసిన రజత్‌ పటీదార్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. నేడు ఎలిమినేటర్‌ విజేతతో గుజరాత్‌ టైటాన్స్‌ క్వాలిఫయర్‌2లో పోటీపడనుంది.

రజత్‌ దండయాత్ర
రజత్‌ పటీదార్‌ (93 నాటౌట్‌) విధ్వంసక ఇన్నింగ్స్‌తో క్వాలిఫయర్‌1ను ఏకపక్షం చేశాడు. 14 ఓవర్లలో 140/3తో నిలిచిన ఆర్సీబీ 200-210 పరుగులు చేసేలా కనిపించింది. 11 బంతుల్లో 16 పరుగులు చేసిన రజత్‌ పటీదార్‌ క్యాచ్‌ను రబాడ వదిలేయటంతో టైటాన్స్‌ భారీ మూల్యమే చెల్లించింది. జీవనదానం లభించగా రజత్‌ పటీదార్‌ విశ్వరూపం చూపించాడు. ఆఖరు ఆరు ఓవర్లలో దండయాత్ర చేశాడు. 9 సిక్స్‌లు, ఐదు ఫోర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రజత్‌ సునామీ ఇన్నింగ్స్‌తో ఆఖరు ఆరు ఓవర్లలో ఆర్సీబీ 114 పరుగులు పిండుకుంది. దీంతో ఆ జట్టు 254 పరుగుల భారీ స్కోరు చేసింది. అంతకుముందు వెంకటేశ్‌ అయ్యర్‌ (19) మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో అదిరే ఆరంభం అందించగా విరాట్‌ కోహ్లి (43), దేవదత్ పడిక్కల్‌ (30, 19 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. కృనాల్‌ పాండ్య (43) పటీదార్‌ తోడుగా కీలక భాగస్వామ్యంలో భాగం అయ్యాడు. జితేశ్‌ శర్మ (15 నాటౌట్) ఓ ఫోర్‌, సిక్స్‌తో అదరగొట్టాడు. టైటాన్స్‌ బౌలర్లలో రబాడ, హోల్డర్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.

టైటాన్స్‌ తడబాటు
255 పరుగుల ఛేదనలో టైటాన్స్‌ చేతులెత్తేసింది. 88/8తో ఓటమి కోరల్లో కూరుకుంది. శుభ్‌మన్‌ గిల్‌ (2), సాయి సుదర్శన్‌ (14), జోశ్‌ బట్లర్‌ (29), నిశాంత్‌ సిందు (5), వాషింగ్టన్‌ సుందర్‌ (8), జేసన్ హోల్డర్ (0), రషీద్ ఖాన్‌ (8), కగిసో రబాడ (5) తేలిపోయారు. రాహుల్‌ తెవాటియ (68) ఆశల్లేని స్థితి నుంచి టైటాన్స్‌ను ముందుకు నడిపించాడు. ఆఖరు ఓవర్‌ వరకు టైటాన్స్‌ పరుగుల వేట సాగించేలా చూశాడు. భువనేశ్వర్‌ కుమార్‌, హాజిల్‌వుడ్‌, కృనాల్‌ పాండ్య, రసిఖ్‌‌ సహా జాకబ్‌ డప్ఫీ టైటాన్స్‌ను శాసించారు. 19.3 ఓవర్లలో టైటాన్స్‌ 162 పరుగులకు ఆలౌటైంది.

సంక్షిప్త స్కోరు వివరాలు :
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు : 254/5 (రజత్‌ పటీదార్‌ 93, విరాట్‌ కోహ్లి 43, కృనాల్‌ పాండ్య 43, జేసన్‌ హోల్డర్‌ 2/39)
గుజరాత్‌ టైటాన్స్‌ : 162/10 (రాహుల్ తెవాటియ 68, జోశ్‌ బట్లర్‌ 29, జాకబ్‌ డఫ్ఫీ 3/39, కృనాల్‌ పాండ్య 2/16, భువనేశ్వర్‌ 2/28)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -