గవర్నర్ కు కవిత, విశారదన్ మహారాజ్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వెలుగుమట్ల, పరిగి, ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని లోక్ భవన్ లో బాధితులను వెంట పెట్టుకుని వారు గవర్నర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రిపోర్ట్ తెప్పించుకుని న్యాయం చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేతలు, ట్రిపుల్ ఆలైన్ మెంట్ మార్పులు, రాయగిరిలో ట్రిపుల్ ఆర్ కోసం భూసేకరణ, కడ్లాపూర్ లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పేదల భూములను లాక్కునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గవర్నర్ కు వివరించినట్టు తెలిపారు.
రూ.వంద చీర ఇచ్చి మహిళలను కోటీశ్వరులను చేశానని కర్కోటక ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారని కవిత ఎద్దేవా చేశారు. వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత సందర్భంగా ఒక మహిళకు గర్భస్రావం అయిందనీ, ఆ కుటుంబం రోదన ఇప్పటికీ గుర్తుకొస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతోషంగా లేరనీ, కల్లాల్లో ధాన్యం కొనుగోలు చేయటం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావటం లేదని విమర్శించారు. వెంటనే రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. భూభాధితుల కోసం ధర్మసమాజ్ పార్టీ, టీఆర్ఎస్ కలిసి చేసిన ఐక్య పోరాటంతో పాక్షికంగా విజయం సాధించినట్టు తెలిపారు. వెలుగుమట్ల లో భూ బాధితులకు అక్కడే ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వటంతో పాటు పరిగి, ట్రిపుల్ ఆర్ సేకరణ ను తాత్కాలికంగా ఆపేశారని గుర్తు చేశారు. పూర్తి స్థాయిలో నిర్వాసితులకు న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇందులో భాగంగానే గవర్నర్ ను కలిసి ఆయనకు అన్ని వివరాలు అందజేశామన్నారు. ట్రిపుల్ ఆర్ ఆలైన్ మెంట్ ను నాలుగు సార్లు మార్చిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆశ్చర్యపోయారన్నారు. దీనికి సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాసిన లేఖకు కూడా గవర్నర్ కు అందజేశామన్నారు. ప్రభుత్వానికి కొన్ని రోజులు సమయం ఇచ్చి ఆ తర్వాత సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్లీ పోరాట బాట పడతామని హెచ్చరించారు.
లక్ష ఎకరాలు కొల్లగొట్టే కుట్ర : విశారదన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లక్ష ఎకరాల భూమి కొల్లగొట్టేందుకు పథకం పన్నారని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ ఆరోపించారు. ఫోర్త్ సిటీ, ట్రిపుల్ ఆర్, పరిగి ఇండస్ట్రీయల్ కారిడర్, వెలుగుమట్ల లో భూ దోపిడీకి ప్లాన్ వేశారన్నారు. దీని పై ఎవరికి చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్నారు. లేదంటే తర్వలోనే పెద్ద ఎత్తున నిరసన తెలిపే కార్యక్రమాలు చేస్తామన్నారు.
వెలుగుమట్ల, పరిగి, ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



