Wednesday, May 27, 2026
E-PAPER
Homeఆటలురేసులో నిలిచేదెవరు?

రేసులో నిలిచేదెవరు?

- Advertisement -

ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌, రాయల్స్‌ ఢీ
రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

నవతెలంగాణ – న్యూ చంఢీగడ్‌
ఐపీఎల్‌ చరిత్రలో ప్లే ఆఫ్స్‌లో ఎలిమినేటర్‌లో ఆడి చాంపియన్‌గా నిలిచిన ఏకైక జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. 2016 తర్వాత మరోసారి ఐపీఎల్‌ విజేతగా నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నేడు రాజస్తాన్‌ రాయల్స్‌తో ఎలిమినేటర్‌లో తాడోపేడో తేల్చుకోనుంది. ఈ సీజన్లలో ఇప్పటికే రాజస్తాన్‌ రాయల్స్‌ను రెండు సార్లు చిత్తు చేసిన ఆరెంజ్‌ ఆర్మీ.. ముచ్చటగా మూడోసారి రాయల్స్‌ను ఓడించి క్వాలిఫయర్‌2కు చేరుకోవాలని తపిస్తోంది. ఇటు సన్‌రైజర్స్‌, అటు రాయల్స్‌ టాప్‌ ఆర్డర్ విధ్వంసక బ్యాటర్లతో ఉరకలేస్తుండగా.. న్యూ చంఢీగడ్‌లో బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై నేడు ఎలిమినేటర్‌ పోరు జరుగనుంది.

ఆరెంజ్‌ ఆర్మీకి ఎదురుందా? :
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భీకర బ్యాటింగ్ లైనప్‌ ఉంది. కానీ ఈ సీజన్లో యువ బౌలర్లు సన్‌రైజర్స్‌ను నాణ్యమైన బౌలింగ్‌ జట్టుగా మార్చారు!. అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ నిలకడగా పరుగులు చేస్తున్నారు. ట్రావిశ్‌ హెడ్‌ నిలకడగా రాణించకపోయినా.. కీలక మ్యాచ్‌ల్లో సత్తా చాటడం హెడ్‌కు అలవాటు. నాకౌట్‌ పోరులో అభిషేక్‌, హెడ్‌ జోడీ పవర్‌ప్లేలో.. మిడిల్‌ ఓవర్లలో ఇషాన్‌ కిషన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ జోడీ… డెత్‌ ఓవర్లలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అనికెత్‌ వర్మ, సలీల్‌ వర్మ త్రయం రాయల్స్‌ బౌలర్లకు చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. పాట్‌ కమిన్స్‌, ఈషన్‌ మలింగ, సకిబ్‌ హుస్సేన్‌, శివాంగ్‌ కుమార్‌, హర్ష్‌ దూబెలతో బౌలింగ్‌ విభాగం బలోపేతంగా కనిపిస్తోంది. రాజస్తాన్‌ రాయల్స్‌ సీజన్‌ను దూకుడుగా ఆరంభించినా.. తర్వాత తడబడ్డారు. వరుస మ్యాచ్‌ల్లో విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరిన రాజస్తాన్‌ రాయల్స్‌ మరో నాకౌట్‌ మ్యాచ్‌కు సిద్దమైంది. వైభవ్‌ సూర్యవంశీ గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై సెంచరీ చేసినా రాయల్స్‌ పరాజయం పాలైంది. వైభవ్‌తో పాటు యశస్వి జైస్వాల్ రాణిస్తే రాయల్స్‌కు అవకాశాలు మెరుగవుతాయి. జోఫ్రా ఆర్చర్‌, బర్గర్‌, యశ్‌ రాజ్‌, బ్రిజేశ్‌ శర్మలతో బౌలింగ్‌ లైనప్‌ సన్‌రైజర్స్‌ బ్యాటర్లకు సవాల్‌ విసిరేందుకు సిద్ధమవుతుంది. న్యూ చంఢీగడ్‌లో ఎలిమినేటర్‌కు సిద్ధం చేసిన పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకోనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -