రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ… 

– పట్టుకొని పోలీసులకు అప్పగించిన ప్రజలు….
– పోలీసుల చేతుల నుండి తప్పించుకుని పరారైన దొంగ..
– షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు….
నవతెలంగాణ షాద్ నగర్ రూరల్ 
పగలు రెక్కీ నిర్వహించి రాత్రి దొంగతనాలు పాల్పడుతున్న దొంగను ప్రజలు పోలీసులకు పట్టిస్తే పోలీసుల నుండి తప్పించుకొని పారిపోయిన ఘటన షాద్నగర్ పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది.  కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం… షాద్ నగర్ పట్టణంలోని సిండికేట్ కాలనీలో గత ఐదు రోజుల నుంచి బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ దొంగ పగలు రెక్కి నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ తీరు సిసి కెమెరాలల్లో రికార్డు అయ్యాయి. అయితే కాలనీవాసులు చాకచక్యంగా సీసీ కెమెరాలు రికార్డుల దృశ్యాల ఆధారంగా మంగళవారం కాలనీవాసులు దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని పసిగట్టి పట్టుకున్నారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు దొంగని కాలనీవాసుల నుండి తమ ఆధీనంలోకి తీసుకొని వివరాలను సేకరించి దొంగను స్టేషన్ కి తరలిస్తున్న సమయంలో పోలీసులను మాయ చేసి మరింత చాకచక్యంగా సదరు దొంగ అటు నుంచి పరారయ్యాడు పరార్ అవుతున్న దొంగను పట్టుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన దొంగ పరారు కావడం పట్ల కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు పట్టుకోరు మేం పట్టుకుని అప్పగిస్తే వదిలేస్తారా అని స్థానిక జనం మండిపడుతున్నారు. పోలీసుల నిర్లక్ష్యం తీరుపై పట్టణంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ విజయ్ కుమార్ తెలిపారు .
Spread the love