ఎర్రజెండా మార్గంలోనే ప్రజా సమస్యల పరిష్కారం

ఎర్రజెండా మార్గంలోనే ప్రజా సమస్యల పరిష్కారం– బీజేపీని ఓడించడమే ఎర్రజెండా లక్ష్యం
– కామ్రేడ్‌ కృష్ణ కుమారి ఆశయాలను కొనసాగిస్తాం.. : సంస్మరణ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి
నవతెలంగాణ-మణుగూరు
దేశంలో తొమ్మిదిన్నరేండ్లు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిందని, దాన్ని ఓడించడమే కృష్ణ కుమారికి అర్పించే నిజమైన నివాళులని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. సోమవారం భద్రాద్రి జిల్లా మణుగురూ మండలం పగిడేరులో మాజీ సర్పంచ్‌, ఎంపీటీసీ కామ్రేడ్‌ కృష్ణకుమారి సంస్మరణ సభ మండల కార్యదర్శి కోడిశాల రాములు అధ్యక్షతన జరిగింది. ముందుగా గ్రామంలో స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభలో ఆమె మాట్లాడుతూ.. కమ్యూనిజంపై అచంచలమైన విశ్వాసం, మనో నిబ్బరం కలిగిన కృష్ణకుమారి ధన్యురాలని అన్నారు. కమ్యూనిజం భావజాలం పునికి పుచ్చుకొని అచంచలమైన విశ్వాసంతో ప్రజా సమస్యలపై అంకితమై పనిచేసిన మహిళ అని కొనియాడారు. ప్రశ్నించేతత్వాన్ని కమ్యూనిజం ద్వారా నేర్చుకొని, సర్పంచ్‌గా, రెండుసార్లు ఎంపీటీసీగా పాలక సమావేశాల్లో ప్రజా సమస్యలపై పోరాడిందని గుర్తుచేశారు. నేడు.. ప్రజా సమస్యలపై పాలకులను ప్రశ్నించే వారిపై కేసులు పడుతున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను హరిస్తూ, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువయిందని, ఉపాధి హామీ పనికి నిధులు కేటాయించలేదన్నారు. ఆహార భద్రతలో ప్రపంచంలో 111 స్థానంలో మన దేశం ఉందని తెలిపారు. అందుకే ఆహార భద్రత, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందని స్పష్టంచేశారు. అనంతరం మాజీ ఎంపీ మిడియం బాబురావు మాట్లాడుతూ.. పినపాక నియోజకవర్గంలో పగిడేరు.. కమ్యూనిస్టు భావజాలం అధికంగా ఉన్న గ్రామమని, ఉద్యమాలకు పేరుగాంచిన గడ్డ అని తెలిపారు. సీపీఐ(ఎం) తరఫున నిలబడి ఉద్యమాలు నిర్వహించి ప్రజాప్రతినిధిగా ప్రజల మనసులను తెలుసుకున్న వ్యక్తి కృష్ణకుమారి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love