ఆదాయ పన్నుల శాఖలో రీఫండ్‌ కుంభకోణం

– వేలాదిగా తప్పుడు క్లెయిములు
– ట్యాక్స్‌పేయర్స్‌తోపాటు ట్యాక్స్‌ ప్రాక్టీషనర్స్‌పైనా విచారణ
– సవరించిన రిటర్న్స్‌ దాఖలుకు డిసెంబర్‌ గడువు : విలేకరుల సమావేశంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ మిథాలి మధుస్మిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతోపాటు ఇతర రాష్ట్రాల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులు సైతం తప్పుడు పత్రాలు చూపి అర్హతలేని క్లెయిమ్‌ల ద్వారా ఆదాయ పన్ను రీఫండ్‌ పొందారనిఐటీ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ మిథాలి మధుస్మిత తెలిపారు. హైదరాబాద్‌లో మాసబ్‌ట్యాంక్‌లోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను ఆమె వెల్లడించారు. ఆదాయ పన్ను చెల్లింపుదారుల లావాదేవీలు సులభంగా జరిగేలా, స్వచ్ఛందంగా పన్నులు చెల్లించేలా ఐటీ రిటర్న్స్‌ ఫారాలను సరళంగా తయారు చేశామని తెలిపారు. చెల్లింపుదారులపై నమ్మకంతో ఫారాలను ఆన్‌లైన్‌లో సులభంగా సమర్పించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రిటర్న్స్‌ సమర్పించే సమయంలో క్లెయిమ్‌ల తగ్గింపులు, మినహాయింపులకు సంబంధించి ఎలాంటి రుజువులుగానీ, పత్రాలనుగానీ ఆన్‌లైన్‌లో సమర్పించాల్సిన అవసరంలేదన్నారు. అయినా సంబంధిత రిటర్న్స్‌ను త్వరిగతిన ప్రాసెస్‌ చేయడంతోపాటు వారికి రావాల్సిన రీఫండ్‌ను వెంటనే ఆయా బ్యాంకు ఖాతాలకు జమచేస్తున్నామని తెలిపారు.
ఆదాయపన్నుల శాఖ కల్పించిన వెసులుబాటును ఆసరా చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని వేతన జీవులు భారీ స్థాయిలో రీఫండ్లు, మినహాయింపులు కోరుతూ తప్పుడు ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసినట్టు గుర్తించామని తెలిపారు. అర్హతలేని క్లెయిమ్‌ల ద్వారా అనేక మంది పన్ను రీఫండ్‌, మినహాయింపులు పొందినట్టు ఇప్పటికే గుర్తించామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులు, ప్రయివేటు సంస్థల ఉద్యోగుల, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు ఈ తరహా తప్పుడు రీఫండ్లు పొందినట్టు విచారణలో గుర్తించామని వివరించారు.
తెలుగు రాష్ట్రాల్లో మూడేండ్లుగా అనేక మంది తప్పుడు క్లెయిమ్‌లతో ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసినట్టు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా గుర్తించామని మధుస్మిత తెలిపారు. 34శాతం రిటర్న్స్‌ 2022-23లో తప్పుడు రీఫండ్లతో కూడిన రిటర్న్స్‌ 84శాతానికి పెరిగాయని, అనుమానం వ్యక్తంచేసిన ఐటీ అధికారులు విచారణ చేయడంతో ఈ అంశం బయటికొచ్చిందని తెలిపారు. తప్పుడు రీఫండ్‌ కోరిన ఉద్యోగులకు సవరించిన ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసేందుకు గడువు ఇచ్చినట్టు తెలిపారు. డిసెంబర్‌ వరకు సవరించిన రిటర్న్స్‌ దాఖలు చేయడానికి అవకాశముందన్నారు. తర్వాత 50శాతం పెనాల్టీతో కూడిన రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు.
ఈ కుంభకోణంపై ఆదాయ పన్నుల శాఖ దర్యాప్తును ముమ్మరం చేసిందన్నారు. ట్యాక్స్‌ ప్రాక్టీషనర్స్‌తోపాటు, టాక్స్‌ పేయర్స్‌పై కూడా విచారణ జరుగుతున్నదని పేర్కొన్నారు. తప్పుడు రీఫండ్లు పొందినవారు వేలాది మంది ఉన్నారని, తప్పులు తెలుసుకుని తిరిగి నగదు చెల్లిస్తున్నావారూ అధికంగానే ఉన్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో సలహాదారులు, దళారులపై చర్యలు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నామని హెచ్చరించారు. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం ఆదాయ వివరాలను తప్పుగా సమర్పించినా, అర్హతలేని మినహాయింపులు, తగ్గింపులు కోరినా తర్వాత పరిణామాలు కఠినంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. ఇందుకు సంబంధించి 12శాతం వడ్డీ, 200శాతం పెనాల్టీ వసూలు చేయడంతోపాటు రెండేండ్లపాటు జైలు శిక్ష విధించే అవకాశముందన్నారు. 2023-24, 2022-23, 2021-22 సంవత్సరాలకు అర్హతలేని తప్పుడు క్లెయిమ్‌ను సరిచూసుకుని, పున:పరిశీలన తర్వాత సవరించిన రిటర్న్స్‌ దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాల్లోని పన్ను చెల్లింపుదారులకు కమిషనర్‌ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Spread the love