Wednesday, June 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంలెబనాన్‌పై ఆగని ఇజ్రాయిల్‌ దాడులు

లెబనాన్‌పై ఆగని ఇజ్రాయిల్‌ దాడులు

- Advertisement -

మూడు రోజులలో శాంతి ఒప్పందం : ట్రంప్‌
పది మందికి పైగా మృతి దాడులు ఆపకుంటే పోరు తప్పదు : ఇరాన్‌ హెచ్చరిక

(నవతెలంగాణ – జనరల్‌ డెస్క్‌)
లెబనాన్‌పై దాడులు ఆపాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న హెచ్చరికలను ఇజ్రాయిల్‌ బేఖాతరు చేస్తోంది. దక్షిణ లెబనాన్‌పై భీకర దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ కోస్తా ప్రాంతంలోని టైర్‌ నగరాన్ని తక్షణమే ఖాళీ చేయాలంటూ ప్రజలకు ఆదేశాలు జారీ చేసిన ఇజ్రాయిల్‌ ఆ వెంటనే ఆ నగరంలోని జనావాస ప్రాంతంపై వైమానిక దాడులు చేసి ఎనిమిది మందిని బలి తీసుకుంది. ఇదిలావుండగా ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై చర్చలు తుది దశలో ఉన్నాయని, రాబోయే మూడు రోజులలో అది ఖరారవుతుందని ట్రంప్‌ చెప్పారు. ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవడం జరుగుతుందని తెలిపారు. మరోవైపు లెబనాన్‌పై బాంబు దాడులు సహా దురాక్రమణ యత్నాలు ఆపని పక్షంలో తిరిగి పోరు ప్రారంభమవుతుందని ఇరాన్‌ తేల్చి చెప్పింది.

ఇజ్రాయిల్‌ హెచ్చరికల నేపథ్యంలో లెబనాన్‌ పౌర రక్షణ కార్యకర్తలు టైర్‌ నగరంలోని వయోవృద్ధులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇజ్రాయిల్‌ హెచ్చరికలతో భయాందోళనలకు గురైన ప్రజలు నగరాన్ని విడిచి పరుగులు తీశారు. నగరంలోని క్రిస్టియన్‌ క్వార్టర్‌ ప్రాంతాన్ని కూడా ఖాళీ చేయాలని ప్రజలను ఇజ్రాయిల్‌ ఆదేశించింది. గతంలో ఇజ్రాయిల్‌ సేనలు ఈ ప్రాంతాన్ని తమ హెచ్చరికల నుంచి మినహాయించారు. అయితే హిజ్బల్లా ఫైటర్లు అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారని ఇజ్రాయిల్‌ తాజాగా ఆరోపించింది. కాగా అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ కేంద్రానికి అత్యంత సమీపంలో కూడా దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం ఐదుగురు చనిపోగా అనేక మంది రెడ్‌క్రాస్‌ సిబ్బంది గాయపడ్డారు. ఇదిలావుండగా దక్షిణ లెబనాన్‌లోని షర్కియెV్‌ా నగరంపై ఇజ్రాయిల్‌ సేనలు జరిపిన డ్రోన్‌ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఇద్దరు పౌర రక్షణ కార్యకర్తలే.

చర్చలలో భాగస్వామ్యం కోసమేనా?
ఇరాన్‌-అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చలలో తనకూ భాగస్వామ్యం కల్పించాలని ఇజ్రాయిల్‌ కోరుకుంటోంది. అందుకే ట్రంప్‌ ఆదేశాలను ధిక్కరించి ఇరాన్‌పై దాడులు చేసింది. శాంతి చర్చల నుంచి ఇజ్రాయిల్‌ను ట్రంప్‌ దూరం పెడుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత తొలిసారిగా రెండు రోజుల క్రితం ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ దాడులు జరిపింది. అయితే కాల్పులు ఆపాలని ఇరాన్‌, ఇజ్రాయిల్‌ దేశాలను ట్రంప్‌ కోరడంతో ఇరు పక్షాలు దాడులను నిలిపివేశాయి. కానీ ఎప్పుడైనా దాడులు తిరిగి మొదలయ్యే అవకాశం ఉన్నదని కూడా చెప్పాయి. తన ప్రయోజనాలను విస్మరిస్తే ఇరాన్‌తో ఎలాంటి తుది ఒప్పందం కుదరదని అమెరికాకు స్పష్టమైన సందేశం పంపేందుకే టెహ్రాన్‌పై ఇజ్రాయిల్‌ దాడులు చేసిందని విశ్లేషకులు తెలిపారు. ఫిబ్రవరిలో ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్‌ ఆ తర్వాత శాంతి చర్చల ప్రక్రియలో దానిని భాగస్వామిని చేయలేదు. ఇరాన్‌-అమెరికా మధ్య దౌత్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. లెబనాన్‌పై దాడులు ఆపడంతో పాటు శాంతి చర్చలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని ఆయన ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూను గట్టిగానే హెచ్చరించారు. గత వారం ట్రంప్‌తో టెలిఫోన్‌ సంభాషణ జరిపిన తర్వాత బీరుట్‌పై వైమానిక దాడులను నెతన్యాహూ నిలిపివేశారు. అయితే నెతన్యాహూ వైఖరిపై ఇజ్రాయిల్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అమెరికా మద్దతు తప్పదా?
అమెరికా-ఇరాన్‌ మధ్య ఏ ఒప్పందం కుదిరినప్పటికీ దక్షిణ లెబనాన్‌లో హిజ్బల్లాపై దాడి చేసే హక్కును, అక్కడ తన సైనిక బలగాలను మోహరించే హక్కును ఇజ్రాయిల్‌ వదులుకోబోదని రక్షణ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ట్రంప్ 9తో జరిగిన ఫోన్‌ సంభాషణలో కూడా నెతన్యాహూ ఇదే విషయాన్ని ప్రస్తావించారని తెలిపారు. ఇరాన్‌ మరోసారి దాడులకు దిగితే ప్రతి దాడులు తప్పవని నెతన్యాహూ ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమంటే ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ ఒంటరిగా సుదీర్ఘ వైమానిక దాడులను కొనసాగించలేదు. అందుకు అమెరికా సహాయ సహకారాలు తప్పనిసరి. నెతన్యాహూ ఇటీవల తన సహాయకులతో మాట్లాడుతూ ఇరాన్‌ విషయంలో ట్రంప్‌ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి తన వద్ద ఎలాంటి ఎత్తుగడలు లేవని అంగీకరించారు. అమెరికా మద్దతు లేకుండా ఇరాన్‌పై దాడి చేసే సామర్ధ్యం ఇజ్రాయిల్‌కు ఉన్నప్పటికీ ఆ దాడులను కొన్ని వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగించడానికి అమెరికా మద్దతు అవసరమవుతుందని నిపుణులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -