రేణుకకు కలిసొచ్చిన సీనియార్టీ..సిన్సియార్టీ

రేణుకకు కలిసొచ్చిన సీనియార్టీ..సిన్సియార్టీ– రాజ్యసభకు ఎంపిక
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో రాజ్యసభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి పేరు ఖరారైంది. ఆమెతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంజన్‌ కుమార్‌ యాదవ్‌ కుమారుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ను తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఏఐసీసీ బుధవారం ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్రకు మరోసారి అవకాశం దక్కింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను 16 సీట్లను దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో ఖమ్మం కీలకమైన సీటు కావడంతో ఇక్కడున్న సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ అధిష్టానం రాజ్యసభకు రేణుకాచౌదరిని అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్‌ఎస్‌ పార్టీ వద్దిరాజును ఎంపిక చేసి ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో రేణుకాచౌదరితో పాటు రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం పలువురు సీనియర్లు పోటీ పడ్డారు. ఒక దశలో కాంగ్రెస్‌ జాతీయ నాయకురాలు సోనియాగాంధీ సైతం తెలంగాణ నుంచి రాజ్యసభ లేదా లోక్‌సభకు పోటీ చేయాలనే డిమాండ్‌ ముందుకొచ్చింది. సీనియర్‌ నేతలు రేణుకాచౌదరి, మాజీ మంత్రులు జానారెడ్డి, చిన్నారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కాంగ్రెస్‌ అధిష్టానం సీనియార్టీతో పాటు పార్టీకి విధేయురాలిగా ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పదికి తొమ్మిది స్థానాలు దక్కేందుకు తోడ్పడిన రేణుకాపై విశ్వాసం ఉంచినట్టు తెలుస్తోంది. రేణుకాచౌదరి గతంలోనే ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. రేణుకా 2012 నుంచి 2018 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 1999, 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి గెలిచారు. ఆ తర్వాత 2009, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదురైనా రేణుకాచౌదరి మాత్రం ‘ఫైర్‌బ్రాండ్‌’గా తన ప్రత్యేకతను నిలుపుకుంటున్నారు.

Spread the love