సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు: అటవీ, పోలీస్ అధికారులు
నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామంలోని ఊరచెరువులో మొసలి ఉన్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అటవీ, పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. కొందరు గ్రామ యువకులు గ్రామ వాట్సప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికలపై చేసిన ప్రచారంతో గ్రామస్తులు, పశువుల కాపరులు, గొర్రెల పెంపకందారులు భయాందోళనకు గురయ్యారు.
దీంతో పోలీస్, అటవీ శాఖ అధికారులు స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. గ్రామస్తులను విచారించడంతో పాటు చెరువును స్వయంగా సందర్శించి పరిశీలించారు. అయితే చెరువులో మొసలి ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రజిత తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పునుంతల ఎస్సై పుట్ట మహేష్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రజిత మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఆధారాలు లేకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం నేరమని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.



