ట్రంప్‌నకు ప్రతిఘటన!

Trumpసుంకాల పోరు మొదలైంది. అమెరికా ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై బుధవారం నుంచి సుంకం పెంచారు. అంతకు ముందు సోమవారం నుంచే చైనా సుంకాలు అమల్లోకి వచ్చాయి. మహాభారతంలో అర్జునుడు రెండు చేతులతో ఒకే సామర్ధ్యంతో బాణాలను సంధించిన కారణంగా సవ్యసాచి అనే పేరు వచ్చింది. అదే మాదిరి అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ మిత్రులు, శత్రువులు అని లేకుండా ఎడాపెడా సుంకాలు విధిస్తున్నాడు. దీనికి ప్రతిఘటన పెరుగుతున్నట్లు పరిణామాలు సూచిస్తున్నాయి. వెనక్కు తగ్గకపోతే బాధితురాలైన ప్రతిదేశం ఒక రోజు అటూ ఇటూగా తన ఆస్త్రాలను సంధించకమానదు. మొండి వైఖరిని వీడకుండా ముందుకే మునుముందుకే అంటే మాంద్యంలో మునిగేది అమెరికా అని అనేక మంది ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాచపీనుగ ఒంటరిగా పోదనట్లు మాంద్యం యావత్‌ ప్రపంచాన్ని ఏదో విధంగా ఆవరిస్తుంది. గోల్డ్‌మన్‌ శాచస్‌ 20శాతం అంటే జెపి మోర్గాన్‌ 40శాతం అమెరికా మాంద్య అవకాశాలు న్నాయని ప్రకటించింది.
తొలుత చైనా, కెనడా, మెక్సికోల మీద పోరు శంఖం పూరించిన ట్రంప్‌ తర్వాత బ్రిక్స్‌ దేశాలు, ఐరోపా యూనియన్‌, ప్రత్యేకించి మనదేశాన్ని కూడా ఆ జాబితాలో కలిపాడు. అంతటితో ఊరుకోలేదు, సుంకాలు తగ్గించేందుకు భారత్‌ అంగీకరించిందని బహిరంగంగా ప్రకటించాడు.మన విశ్వగురువు మౌనవ్రతం పాటిస్తూ అలాంటిదేమీ లేదని పార్లమెంటరీ కమిటీ ముందు ఒక అధికారితో చెప్పించారు. అదే సమయంలో ఎలన్‌మస్క్‌ స్టార్‌లింక్‌తో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్లు జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలు ప్రకటించాయి. ఇంతవరకు అసలు స్టార్‌లింక్‌కు మనదేశం అనుమతి ఇవ్వకుండానే ఈ ప్రకటనలు వెలువడ్డాయంటే తెరవెనుక ఏదో జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఉనికిలో లేని కంపెనీ సేవలు అవి ఎలా అందిస్తాయి ? అమెరికా దిగుమతులపై కెనడా, ఐరోపా యూనియన్‌ కూడా 25శాతం వంతున ప్రతి సుంకాలు ప్రకటించాయి. మనదేశం మౌనంగా ఉంది. వాణిజ్యాలకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి పలుకుబడితో వేర్వేరుగా దేశాలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.వాణిజ్య పోరులో ఒక దేశం ఎక్కువా తక్కువా అన్నది పక్కన పెడితే ప్రతిదేశం నిబంధనలకు పాతరవేస్తున్నట్లే.
ప్రపంచీకరణ యుగంలో ప్రతిదేశం మరొకదాని మీద ఏదో విధంగా ఆధారపడి ఉన్నందున కర్ర ఉన్నవాడిదే గొర్రె అంటే కుదిరే రోజులు కావివి. మా వస్తువుల మీద పన్నులు వేస్తే మీ కొన్ని రాష్ట్రాలకు సరఫరా చేసే విద్యుత్‌ నిలిపివేత లేదా పన్నులు వేస్తామని కెనడాలో ఓంటారియో అనే ఒక రాష్ట్ర ప్రధాన మంత్రి కూడా ప్రపంచ అగ్రరాజ్య అధిపతి ట్రంప్‌ను హెచ్చరించాడంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. బలవంతుడైన సర్పము చలి చీమలచేత చచ్చినట్లుగా పరిస్థితి ఉందన్నది స్పష్టం. ఒక హానికారక వైరస్‌ పుట్టుక ఎక్కడైనా ఎటు గాలివీస్తే అటు విస్తరిస్తుంది, తన మన అనే విచక్షణ లేకుండా ఎవ్వరినీ వదలదు.వాణిజ్య పోరు కూడా అలాంటిదే. ఒక వేళ వచ్చే నెల రెండవ తేదీ నుంచి మన వస్తువుల మీద కూడా ట్రంప్‌ వేటు పడితే ఒక ప్రధాన ఎగుమతి అయిన ఔషధ పరిశ్రమ తీవ్రంగా ప్రభావితం కావచ్చని చెబుతున్నారు. జనరిక్‌ మందుల ధరలు పెరిగితే కోట్లాది మంది అమెరికన్‌ రోగులు, గిట్టుబాటుగాక మన పరిశ్రమలు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రంగంలోని కార్మికులు, ఉద్యోగులు, వాణిజ్యం కూడా ప్రభావితంగాక తప్పదు.మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న జనరిక్స్‌ విలువ ఏటా 12.7 బిలియన్‌ డాలర్లు కాగా దాని వలన అమెరికాకు 219 బిలియన్‌ డాలర్ల మేర ఆరోగ్య ఖర్చు తగ్గిందని అంచనా.
మన దేశం అమెరికా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న 36 ప్రాణాధార ఔషధాలపై సుంకాలను పూర్తిగా ఎత్తివేసినప్పటికీ ట్రంప్‌ సంతృప్తి చెందినట్లు కనిపించటం లేదు. మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ అమెరికా వెళ్లి సంప్రదింపులు జరిపిన తర్వాతే ట్రంప్‌ మనమీద సుంకాల యుద్ధ ప్రకటన చేశాడు.అందరూ నష్టపోతారంటూ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ చేసిన హెచ్చరికను వాణిజ్యపోరుకు నాందిపలికిన ట్రంప్‌ తలకెక్కించుకుంటాడా! తగ్గేదేలే అంటూ ముందుకు పోతాడా!! సుంకాల పోరులో అంతిమంగా పరాజితులు వినియోగ దారులే. ఏ దేశం ఎంత పన్ను పెంచితే ఆ మేరకు భారం భరించాల్సిందే. వస్తువుల కొనుగోలు తగ్గించుకుంటే అది ఒక విషవలయంలా మారుతుంది.చివరకు కష్టజీవులనే బలి తీసుకుంటుందన్నది చరిత్ర చెప్పిన సత్యం.

Spread the love