
– కొత్తపల్లి శివకుమార్ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
కామ్రేడ్ అరుణోదయ రామారావు 5వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ లో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగిందని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి శివకుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నక్సల్బరీ వసంత మేఘ గర్జనతో ప్రేరణ పొంది, గోదావరి లోయలో ప్రజా పోరాటాలు నడుస్తున్న క్రమంలో కామ్రేడ్ రామారావు విప్లవొద్యమానికి పరిచయం అయ్యాడన్నారు. ఆనాటికి జానపద కళాకారుడుగా ఉన్న రామారావు విప్లవ ఉద్యమ స్ఫూర్తితో కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నాడు అన్నారు. కళ కోసం కళ కాదు, కళ పీడిత ప్రజానీకం విముక్తి కోసమని నమ్మి, తను నమ్మిన సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడి ఉన్నాడు అన్నారు. కామ్రేడ్ కానూరి తాతతో కలిసి ఎన్నో కళారూపాలకు జీవం పోశాడు అని గుర్తు చేసుకున్నారు.అన్న అమరుడు రా, అడవి ఏడిచింది, ఉయ్యాలో జంపాల, అరుణ అరుణ బాటలో ఇలా ఎన్నో పాటలకు తనదైన శైలిలో జీవం పోసి వాటిని సజీవంగా నిలిపాడు అన్నారు.బూర్జువా కళారంగం తనకు ఎన్నో ఆఫర్లు ఇచ్చినప్పటికీ, ఆ అవకాశాలను తృణప్రాయంగా త్యజించాడని కొనియాడినారు. విప్లవోద్యమంలో వస్తున్న అన్య వర్గ ధోరణులను సున్నితంగా తిరస్కరించిన గొప్ప సాంస్కృతిక రథసారధి అన్నారు.హిందూ మతోన్మాద ఫాసిస్ట్ రాజ్యం, ప్రగతిశీల భావజాలంపై దాడులు చేస్తున్న ఈ సందర్భంలో కామ్రేడ్ లేకపోవడం ప్రగతిశీల కళాకారులకు పెద్ద లోటని అన్నారు.కాలం చేసిన గాయంలో కామ్రేడ్ లేకపోయినా ఆయన అందించిన సాంస్కృతిక ఆశయాల జండా నేటి కళాకారులు భుజాన వేసుకొని మునుముందుకు సాగడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అన్నారు. అమరులు కలలుగన్న సమ సమాజ స్థాపన కోసం విప్లవ సాంస్కృతిక కళాకారులు ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక, జిల్లా నాయకులు కారింగుల వెంకన్న,పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్ల నాగయ్య, ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఎస్కే.సయ్యద్, పిడమర్తి లింగన్న, మల్లయ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు.