రహదారుల మరమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలి..

– సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి

నవతెలంగాణ-గోవిందరావుపేట
మేడారం వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారులను వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం మండలంలోని 163 వ జాతీయ రహదారి గుండ్ల వాగు వంతెన దెబ్బతిన్న ప్రాంతాలను మరియు పసర టు మేడారం వర్షాలకు దెబ్బతిన్న ఆర్ఎంపి రహదారిని పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గుండ్ల వాగు దెబ్బతిన్న భాగాలను వెంటనే పూర్తి చేయాలని మేడారం జాతర వాహనాల రాకపోకల దృష్ట్యా ఎలాంటి అంతరాయం కలవకుండా చూడాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించాలని అన్నారు. ఎత్తైన వంతెన చివరి భాగాల్లో దెబ్బతిన్న ప్రాంతాలను ప్రమాదాలకు తావు లేకుండా నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు.  అనంతరం పసర నుండి మేడారం వెళ్లే రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఉన్న రహదారిని ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. సంబంధిత అధికారులకు మరియు గుత్తేదారుతో వెంటనే ఫోన్ ద్వారా సంభాషించి పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. జాత రాకపోకలకు ఎక్కడ కూడా చిన్న అంతరాయం కూడా లేకుండా చూడాలని అన్నారు. సుమారు పది సంవత్సరముల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్వహిస్తున్న మేడారం జాతరను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీజ, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం , డి.ఎస్.పి రవీందర్, ఇతర శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీతక్కను కలిసిన కొడంగల్ ప్రజలు
మండల పర్యటనలో ఉన్న మంత్రి సీతక్కని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ కు చెందిన ప్రజలు కలిసి పరిచయం చేసుకొని సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కొడంగల్ ప్రజలు మాట్లాడుతూ మేడారం వెళుతున్న క్రమంలో సీతక్క కనిపించిందని ఎప్పటినుండో సీతక్కను చూడాలి కలవాలి అని అనుకుంటుండే వారమని ఆ సమ్మక్క తల్లి దయవల్ల మా చిరకాల వాంఛ నెరవేరిందని సీతక్క కనిపించడం మాట్లాడడం ఫోటోలు దిగడం సాక్షాత్తు సమ్మక్క తల్లి కనిపించినంత ఆనందంగా ఉందని అన్నారు.
Spread the love