Sunday, September 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి

కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి

- Advertisement -

– 150 కుటుంబాలకు తప్పని అవస్థలు..
– వర్షాకాలంలో మరింత ఇబ్బందులు
నవతెలంగాణ – కామారెడ్డి

పట్టణంలోని 15వ వార్డుకు చెందిన అయోధ్యనగర్‌, శ్రీనివాస్‌నగర్‌, ఆర్‌కేనగర్‌ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 150 కుటుంబాలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు, దీనికి తోడు బోరు పైప్ లైన్ లీకై అట్టి నీరు రోడ్లపై నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు.

ఈ కాలనీల మీదుగా మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాల, ప్రభుత్వ అనాథ ఆశ్రమం, గురుకుల వసతి గృహాలు, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలకు విద్యార్థులు, సిబ్బంది ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుంటారు. అయినప్పటికీ రహదారుల దుస్థితిపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆరు నెలలుగా పైప్‌లైన్‌ లీకేజీ
ఎస్సీ, ఎస్టీ వసతి గృహానికి వెళ్లే మార్గంలో ఉన్న బోర్‌ పైప్‌లైన్‌ గత ఆరు నెలలుగా తరచూ లీకేజీ అవుతోందని కాలనీవాసులు తెలిపారు. దీంతో రోడ్డుపై నీరు చేరి బురదమయంగా మారుతోందని, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు నడిచి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్యను పలుమార్లు వసతి గృహ వార్డెన్‌, స్థానిక కౌన్సిలర్‌, మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని వాపోయారు.

ఓట్లు లేవనే కారణంతోనేనా?
కాలనీలో తమకు ఓట్లు లేవనే కారణంతోనే రాజకీయ నాయకులు అభివృద్ధి పనులను పట్టించుకోవడం లేదని కొందరు నాయకులు ముఖాముఖిగా చెబుతున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో అందరినీ సమానంగా చూస్తామని చెప్పే ప్రజాప్రతినిధులు, ఎన్నికల అనంతరం తమ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడంతోపాటు లీకేజీ అవుతున్న పైప్‌లైన్‌ను మరమ్మతు చేసి, విద్యార్థులు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వారు మున్సిపల్‌ అధికారులను కోరుతున్నారు. సమస్యను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులను కలిసి తమ సమస్యలను మరోసారి వినతిపత్రం ద్వారా తెలియజేస్తామని కాలనీవాసులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -