ఫైనల్లో ముంబయిపై ఘన విజయం
రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్
నవతెలంగాణ-హైదరాబాద్
రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్‌పీఎల్) చాంపియన్‌గా హైదరాబాద్ హీరోస్ నిలిచింది. తొలి సీజన్లో లీగ్ దశ టాపర్‌గా నిలిచినా మూడో స్థానంతో సరిపెట్టుకున్న హైదరాబాద్ హీరోస్ రెండో సీజన్‌లో దుమ్మురేపింది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఆర్‌పీఎల్ ఫైనల్లో ముంబయి డ్రీమర్స్‌పై హైదరాబాద్ హీరోస్ ఘన విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ హీరోస్ 41-17తో ముంబయి డ్రీమర్స్‌ను చిత్తు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. టైటిల్ పోరులో హైదరాబాద్ హీరోస్ తిరుగులేని ప్రదర్శన చేసింది. మ్యాచ్ మొదలైన ఆరంభంలో ముంబయి డ్రీమర్స్ ఆధిపత్యం చూపించింది. కానీ ముంబయి డ్రీమర్స్ ఆ జోరు ఎంతోసేపు కొనసాగించలేదు. వేగంగా పుంజుకున్న హైదరాబాద్ హీరోస్ ఎదురుదాడి చేసింది. బంతిపై నియంత్రణతో పాటు గోల్స్ సాధించటంలోనూ హైదరాబాద్ హీరోస్ దూకుడు కనబరిచింది. ద్వితీయార్థంలోనూ హైదరాబాద్ హీరోస్ జోరు కొనసాగించింది. ముంబయి డ్రీమర్స్ పుంజుకునే ప్రయత్నం చేసినా.. అవేవీ సఫలీకృతం కాలేదు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్ 22-19తో చెన్నై బుల్స్‌పై మెరుపు విజయం సాధించింది. రగ్బీ ప్రీమియర్ లీగ్ విజేత హైదరాబాద్ హీరోస్ రూ.45 లక్షలు నగదు బహుమతి అందుకోగా.. రన్నరప్ ముంబయి డ్రీమర్స్ రూ.25 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్ రూ.15 లక్షలు ప్రైజ్‌మనీ దక్కించుకున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి హాజరు
రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్‌పీఎల్) రెండో సీజన్ ముగింపు వేడుకలు, ఫైనల్ మ్యాచ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కొణిదెల చిరంజీవి, బ్యాడ్మింటన్ స్టార్ పి.వి సింధు, జిఎంఆర్ కార్పోరేట్ చైర్మెన్ గ్రంథి కిరణ్, రగ్బీ ఇండియా అసోసియేషన్ అధ్యక్షుడు రాహుల్ బోస్, సినీ నటీ మృణాల్ ఠాకూర్ తదితరులు ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా విజేత, రన్నరప్ జట్లు ట్రోఫీలు, నగదు బహుమతులు అందుకున్నారు.



