గ్రామీణ బ‌తుకింతే

Increasing employment demand– పెరుగుతున్న ఉపాధి డిమాండ్‌
– తక్కువ వేతనాలు

– ధరలకు అనుగుణంగా పెరగని వేతన రేట్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
‘ఉపాధి’ కోసం డిమాండ్‌ పెరగడం కొనసాగుతున్న గ్రామీణ కష్టాలను స్పష్టం చేస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌)లో పని కోసం డిమాండ్‌లో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసుకుంది. ఇది కరోనా మహమ్మారి ముందు స్థాయిలను అధిగమించింది. అంతేకాక, గత దశాబ్దంలో గ్రామీణ వేతనాల రేట్లు తక్కువగా ఉన్నాయి. ఆహార ద్రవ్యోల్బణం డిసెంబరులో దాదాపు 10 శాతం వద్ద నమోదైంది. గత కొన్నేండ్లుగా 5 నుంచి 6 శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గ్రామీణ వేతన రేట్లు పెరగలేదు. ఇది బహుశా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ వస్తువుల డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది.
‘ఉపాధి’కి పెరిగిన డిమాండ్‌
ఉపాధి హామీ చట్టం 2023-24లో 305.2 కోట్ల వ్యక్తిగత రోజులను నమోదు చేసింది. ఇది 2022-23లో 293.7 కోట్లుగా ఉంది. ఇది కొనసాగుతున్న గ్రామీణ కష్టాలను, నగరాల్లో ఉద్యోగ అవకాశాల కొరతను సూచిస్తుంది. దేశం మహమ్మారి నుండి బయటపడిన మొదటి సంవత్సరం 2022-23 కాబట్టి తగ్గుదల అంచనాలు ఉన్నప్పటికీ, 2023-24లో దాదాపు 12 కోట్ల వ్యక్తిగత రోజుల డిమాండ్‌ పెరగడం గమనించవచ్చు. 2022-23లో వ్యక్తిగత రోజులు 2019-20 కంటే 28.4 కోట్లు ఎక్కువ. 2023-24లో ఇప్పటి వరకు దాదాపు 40 కోట్లు పెరిగాయి. 2020-21 మహమ్మారి బారిన పడిన సంవత్సరంలో పని ఉత్పత్తి 389.9 కోట్ల వ్యక్తిగత రోజుల ఆల్‌-టైమ్‌ రికార్డ్‌ను నమోదు చేసుకుంది. ఆపై 2021-22లో 363.2 కోట్లకు పడిపోయింది. ఉపాధి హామీ పనికి అధిక డిమాండ్‌ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కొరతను సూచిస్తుంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉపాధి హామీ కోసం తక్షణ సహాయంగా అదనంగా రూ. 3,400 కోట్లను విడుదల చేసింది. 2023-24 కోసం సవరించిన అంచనా రూ. 86,000 కోట్ల కంటే ఎక్కువ, పని డిమాండ్‌ అంచనాలను అధిగమించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 89,400 కోట్లు ఉపాధి హామీ కేటాయింపులు చేసింది. అంతకు ముందు సంవత్సరానికి రూ. 90,806 కోట్లు ఉంది.
తగ్గిన గ్రామీణ వేతనాలు
పెరుగుతున్న ఆహార ధరలకు అనుగుణంగా గ్రామీణ వేతనాలు పెరగడం లేదు. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) డేటా ప్రకారం పురుషుల సగటు గ్రామీణ వేతన రేటు 2008-09 నుండి 2013-14 వరకు రెండంకెలలో ఉండగా, తరువాతి సంవత్సరాల్లో ఇది గణనీయంగా తగ్గింది. 2013-14లో ఇది 27.98 శాతం ఉండగా, 2021-22లో 4.46 శాతానికి, 2022-23లో 5.86 శాతానికి తగ్గింది. సీఎంఐఈ డేటా ప్రకారం, మహిళల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. 2013-14లో మహిళల వేతన రేటు 25.25 శాతంగా ఉంది. ఇది 2021-22 5.4 శాతం, 2022-23లో 6.24 శాతానికి తగ్గింది.

Spread the love