గ్రామీణ ప్రతిభను వెలికితీయాలి

–  మరింత మంది ధోనీలను తయారు చేయాలి
– ఐఎస్‌బిసి గౌరవ చైర్మెన్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి
నవతెలంగాణ-హైదరాబాద్‌
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభాంతులైన క్రికెటర్లకు కొదవలేదు. నైపుణ్యం ప్రదర్శించేందుకు ఓ వేదిక లేకపోవటంతో ఎంతోమంది నాణ్యమైన క్రీడాకారులు కనుమరుగవుతున్నారు. పాఠశాల స్థాయిలోనే మెరికల్లాంటి క్రికెటర్లను వెలికితీసి.. మరింత మంది ధోనీలను తయారు చేయటమే ఐఎస్‌బిసి లక్ష్యం. స్కూల్‌ క్రికెట్‌ స్థాయిలో ప్రపంచ కప్‌ నిర్వహణకు ఆకర్షితుడిని అయ్యాను’ అని భారతీయ సినిమా దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అన్నారు. భారత్‌లో స్కూల్‌ క్రికెట్‌ బలోపేతానికి ముందుకొచ్చిన జక్కన్న.. ఇండియన్‌ స్కూల్స్‌ బోర్డ్‌ ఫర్‌ క్రికెట్‌ (ఐఎస్‌బిసి) గౌరవ చైర్మెన్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఐఎస్‌బిసి ఫౌండర్‌ సీఈవో సునీల్‌బాబు కొలనుపాక వెల్లడించారు.
మహిపై మక్కువ : ‘ఎం.ఎస్‌ ధోని అంటే ఎంతో ఇష్టం. ధోని వంటి వజ్రాల్లాంటి నాణ్యమైన క్రికెటర్లకు గ్రామీణ స్థాయిలో నిరూపించేందుకు ఓ వేదిక అందుబాటులోకి వచ్చింది. నేను స్కూల్‌డేస్‌లో ఉండగా అందరం ఒకే బ్యాట్‌తో క్రికెట్‌ ఆడేవాళ్లం. నేను కాలేజ్‌ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు.. ఆ టీమ్‌లోని ఆటగాళ్ల కంటే మా స్కూల్‌లోని ప్లేయర్లు ఎంతో మెరుగు అనిపించింది. కానీ వారికి నిరూపించుకునే వేదిక స్కూల్‌ స్థాయిలో దక్కలేదు. ఐఎస్‌బిసి స్కూల్‌ లీగ్‌తో దేశవ్యాప్తంగా వర్థమాన క్రికెటర్లకు మేలు జరుగనుంది’ అని రాజమౌళి తెలిపారు.
జనవరిలో స్కూల్‌ క్రికెట్‌ ప్రపంచకప్‌ : 2024 జనవరిలో స్కూల్స్‌ క్రికెట్‌ ప్రపంచకప్‌ నిర్వహించ నున్నారు. ఈ ప్రపంచకప్‌లో ఎనిమిది దేశాలు పోటీపడనున్నాయి. అంతకముందు, ప్రాజెక్ట్‌ స్కూల్‌ వరల్డ్‌కప్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 766 జిల్లాల్లో ఇంటర్‌ డిస్ట్రిక్‌, ఇంటర్‌ స్టేట్‌, ఇండియన్‌ స్కూల్‌ టాలెంట్‌ లీగ్‌ (ఐఎస్‌టీఎల్‌) నిర్వహిస్తారు. ఇండియన్‌ స్కూల్‌ టాలెంట్‌ లీగ్‌లో ఎనిమిది ప్రాంఛైజీలు ఆడతాయి. ఈ లీగ్‌లో విజేతగా నిలిచిన జట్టు స్కూల్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనుంది.
మెగా టాలెంట్‌ హంట్‌ : ఇక ఇండియన్‌ స్కూల్‌ టాలెంట్‌ లీగ్‌, ప్రాజెక్ట్‌ స్కూల్‌ వరల్డ్‌కప్‌లో భాగమయ్యేందుకు ఐఎస్‌బిసి.. మెగా టాలెంట్‌ హంట్‌కు సిద్ధమైంది. 12-16 ఏండ్ల యువ క్రికెటర్లు తమ బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌, వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలతో కూడిన 60 సెకండ్ల నిడివి గల వీడియోను ఐఎస్‌బిసి వెబ్‌సైట్‌ లేదా ఐఎస్‌బిసి యాప్‌లో పోస్ట్‌ చేయాలి. ఐఎస్‌బిసి చీఫ్‌ మెంటార్‌ దిలిప్‌ వెంగ్‌సర్కార్‌ సారథ్యంలోని నిపుణులు వీడియోలను పరిశీలించి ప్రతి జిల్లా నుంచి 400 మంది క్రికెటర్లను ఎంపిక చేయనున్నారు. ఈ విధంగా ఎంపికైన 400 మంది వర్థమాన క్రికెటర్లు జిల్లా స్థాయి స్కూల్‌ క్రికెట్‌ లీగ్‌లో పోటీపడేందుకు అర్హత సాధిస్తారు.

Spread the love