వెస్టిండీస్‌ అవుట్‌

– స్కాట్లాండ్‌ చేతిలో ఓటమి
– 2023 వన్డే వరల్డ్‌కప్‌కు దూరమైన కరీబియన్లు
హరారే (జింబాబ్వే) : 1975, 1979 ప్రపంచకప్‌ విజేత, 1983 వరల్డ్‌కప్‌ ఫైనలిస్ట్‌ వెస్టిండీస్‌ అవుట్‌. 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ రేసు నుంచి కరీబియన్‌ జట్టు నిష్క్రమించింది. జింబాబ్వేలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో పేలవ ప్రదర్శన కొనసాగించిన వెస్టిండీస్‌.. తాజాగా సూపర్‌ సిక్స్‌ దశలో స్కాట్లాండ్‌ చేతిలో పరాజయం పాలైంది. ఈ ఓటమితో టాప్‌-2లో చోటు సాధించే అవకాశాలు కోల్పోయిన వెస్టిండీస్‌.. ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు. ఐసీసీ ప్రపంచకప్‌ చరిత్రలో కరీబియన్‌ జట్టు లేకుండా వన్డే వరల్డ్‌కప్‌ (13) జరుగనుండటం ఇదే తొలిసారి కానుంది. శనివారం హరారేలో జరిగిన క్వాలిఫయర్స్‌ సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై స్కాట్లాండ్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత వెస్టిండీస్‌ 181 పరుగులకే కుప్పకూలింది. జేసన్‌ హోల్డర్‌ (45), రోమారియో (36) ఆదుకున్నారు. స్కాట్లాండ్‌ బౌలర్లు బ్రాండన్‌ మెక్‌కల్లమ్‌ (3/32), క్రిస్‌ సోల్‌ (2/48), మార్క్‌ వాట్‌ (2/25), క్రిస్‌ గ్రీవ్స్‌ (2/30) రాణించారు. ఛేదనలో మూడు వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్‌ 43.3 ఓవర్లలో 185 పరుగులు చేసింది. ఓపెనర్‌ మాథ్యూ క్రాస్‌ (74 నాటౌట్‌), బ్రాండన్‌ మెక్‌కల్లమ్‌ (69) అర్థ సెంచరీలతో రాణించారు.
ఐసీసీ ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ గ్రూప్‌ దశలో జింబాబ్వే, నెదర్లాండ్స్‌, నేపాల్‌, యుఎస్‌ఏలతో వెస్టిండీస్‌ గ్రూప్‌-ఏలో నిలిచింది. గ్రూప్‌ దశలో యుఎస్‌ఏ, నేపాల్‌పై నెగ్గిన కరీబియన్లు.. జింబాబ్వే, నెదర్లాండ్స్‌ చేతిలో ఓడారు. టాప్‌-3 పొజిషన్‌తో సూపర్‌ సిక్స్‌ దశకు చేరినా.. గ్రూప్‌ దశలో సాధించిన పాయింట్లు సూపర్‌ సిక్స్‌లోనూ పరిగణనలోకి తీసుకుంటారు. రెండు విజయాలు, రెండు ఓటములతో సూపర్‌ సిక్స్‌కు వెస్టిండీస్‌ ‘సున్నా’ పాయింట్లతో వచ్చింది. ఇదే సమయంలో శ్రీలంక, జింబాబ్వేలు గ్రూప్‌ దశ నుంచి నాలుగు పాయింట్లతో సూపర్‌సిక్స్‌కు చేరగా.. నెదర్లాండ్స్‌ రెండు పాయింట్లతో చేరింది. సూపర్‌ సిక్స్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. వెస్టిండీస్‌ సూపర్‌ సిక్స్‌లో తొలి మ్యాచ్‌లో ఓడటంతో.. ఇక తర్వాతి రెండు మ్యాచుల్లో నెగ్గినా గరిష్టంగా నాలుగు పాయింట్లే దక్కించుకుంటుంది. నాలుగు పాయింట్లతో టాప్‌-2లో నిలిచే పరిస్థితి లేదు. దీంతో సూపర్‌ సిక్స్‌ దశలో మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే వెస్టిండీస్‌ 2023 వన్డే వరల్డ్‌కప్‌ రేసు నుంచి నిష్క్రమించింది. 2019 వన్డే వరల్డ్‌కప్‌కు సైతం వెస్టిండీస్‌ క్వాలిఫయర్స్‌ ఆడి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడూ స్కాట్లాండ్‌తో వర్షం ప్రభావిత మ్యాచ్‌లో వెస్టిండీస్‌ గట్టెక్కగా.. ఈసారి స్కాట్లాండ్‌ ప్రతీకారం తీర్చుకుంది.

Spread the love