ఏపీలో అదే ఉద్రిక్తత

Same tension in AP– నివురుగప్పిన నిప్పులా పలు ప్రాంతాలు
– పల్నాడులో ఆగని దాడులు
– భూమా అఖిల ప్రియ సెక్యూరిటీ గార్డుపై హత్యాయత్నం
– పలుచోట్ల అభ్యర్థుల గృహనిర్బంధం
విజయావాడ : పోలింగ్‌ ప్రక్రియ ముగిసి రోజులు గడుస్తున్నా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం నాడు కూడా దాడులు అగలేదు. ఘర్షణలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో అభ్యర్థులను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు. ఘర్షణలు జరుగుతున్న అన్ని ప్రాంతాల్లోనూ 144వ సెక్షన్‌ విధించి, కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయినా, అనేక ప్రాంతాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజానీకంలో వ్యక్తమవుతోంది. ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ సెక్యూరిటీ గార్డుపై హత్యాయత్నం జరిగింది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత స్నేహితులతో కలిసి ఇంటిముందు ఉన్న అఖిలప్రియ బాడిగార్డుపై కారులో వచ్చిన కొందరు దుండగలు దాడికి పాల్పడ్డారు. కారుతో వేగంగా వచ్చి ఆయన్ను ఢ కొన్నారు. కింద పడిపోయిన నిఖిల్‌ను రాడ్లతో కొట్టారు. ఆయన తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్లిపోయాడు. అక్కడున్నవారు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు కారులో పరారయ్యా రు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలైన నిఖిల్‌ నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతు న్నారు. అఖిలప్రియ సమాచారంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని అక్కడి సీసీ పుటేజ్‌ను పరిశీలించి ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
మాచర్లలో అప్రకటిత కర్ఫ్యూ
పల్నాడు జిల్లా మాచర్లలో అప్రకటి కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. గుంటూరు రేంజి ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి, ఎస్‌పి గరికపాటి బిందు మాధవ్‌మాచర్లలో నే మకాం వేశారు. జిల్లా వ్యాప్తంగా 144వ సెక్షన్‌ విధించారు. అన్ని ప్రాంతాల్లోనూ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మొత్తం 19 కంపెనీల పారా మిలటరీ బలగాలను రప్పించారు. రెండు వేల మంది పోలీసులు మాచర్ల, గురజాల, నర్సరావుపేట ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. గ్రామాల్లోకి వచ్చే వాహనానాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మాచర్ల, గురజాల, నర్సరావుపేట ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్‌ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థులు చదలవాడ అరవిందబాబు (నరసరావుపేట), జూలకంటి బ్రహ్మారెడ్డి (మాచర్ల)లతో పాటు పలువురు టీడీపీ, వైసీపీ నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి తదితర పట్ట్టణాల్లో వరుసగా మూడో రోజు కూడా దుకాణాలను మూతపడ్డాయి.అయినా మంగళవారం రాత్రి మాచవరంలో వైసిపి నాయకులు చౌదరి సింగరయ్య, దారం లచ్చిరెడ్డిలపై టీడీపీ నాయకులు దాడి చేశారు. దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామంలో వైసిపి నాయకులు ఆదిరెడ్డిని టీడీపీ వారు దాడి చేసి గాయపర్చారు.
తాడిపత్రిలో చెక్‌పోస్టులు ఏర్పాటు
ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో తాడిపత్రిలోకి కొత్తవారు ఎవరూ ప్రవేశించకుండా నలువైపులా చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటుచేశారు. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జెసి.ప్రభాకర్‌రెడ్డి కార్యాలయాలు/ఇండ్లవద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. తాడిపర్తి నియోజకవర్గంలోని ముఖ్య నేతలను అరెస్టు చేసి సత్యసాయి, కర్నూలు జిల్లాల్లోని పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి తమ కార్యాలయాల డోర్లు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించి కంప్యూటర్లు హార్డ్‌ డిస్క్‌లు ధ్వంసం చేశారని ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పెద్దారెడ్డి ఓ ప్రకటనలో ఆరోపించారు. మంగళవారం నాడు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించిన ఘటనలో అస్వస్థతకు గురైన మాజీ ఎంఎల్‌సి జెసి ప్రభాకర్‌రెడ్డిని ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
జమ్మలమడుగులో పారా మిలిటరీ బలగాలు
వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు పోలీసుల వలయంలో ఉంది.దాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమ య్యారు. పారా మిలిటరీ బలగాలను జమ్మలమడుగు కు తరలించారు. సమస్యాత్మక గ్రామాల్లో, రాజకీయ పార్టీ కార్యాలయాల వద్ద, టీ అంగళ్లు, బస్‌ షెల్టర్లు, ప్రజలు గుమికూడే ప్రదేశాల్లో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. జమ్మలమడుగులో 500 మంది అదనపు పోలీస్‌ బలగాలను దింపారు. ముద్దనూరు నుంచి వైసీపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే, అభ్యర్థి సుధీర్‌రెడ్డిని నిడిజువ్వి, టీడీపీ కడప ఎంపి అభ్యర్థి భూపేష్‌ సుబ్బరామిరెడ్డి, బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దేవగుడి గ్రామాలను విడిచి బయటకు వెళ్లరాదని పోలీసులు ఆంక్షలు విధించారు.

Spread the love