– చెన్నై సూపర్‌కింగ్స్ 207/7
– ముంబయి ఇండియన్స్ 104/10
ఈ సీజన్‌లోనే చెన్నై ఖాతాలో భారీ గెలుపు
ముంబయి : టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ (101 నాటౌట్) అజేయ రాణించడంతో చెన్నై సూపర్‌కింగ్స్ 103 పరుగుల తేడాతో ముంబయిపై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. వాంఖడే స్టేడియం వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 207పరుగుల భారీస్కోర్ నమోదు చేసింది. అనంతరం ఆకెల్ హొసైన్, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో చెలరేగడంతో ముంబయి జట్టు 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ మూడో గెలుపుతో పాయింట్ల పట్టికలో పై పైకి ఎగబాకింది. టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. హార్దిక్ వేసిన రెండో ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్(22) రెండు ఫోర్లు, సిక్సర్‌తో రాణించాడు. మరో ఎండ్‌లో సంజూ శాంసన్(101నాటౌట్; 54బంతుల్లో 10ఫోర్లు, 6సిక్సర్లు) శతకంతో గర్జించాడు. చెన్నై స్కోర్ 32పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. అనంతరం శాంట్నర్ ఓవర్లో వరసగా రెండు ఫోర్లు బాదిన సర్ఫరాజ్ ఖాన్ (15) అనూహ్యంగా నాలుగో బంతికి బౌల్డయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శివం దూబే(5)ను ఘజన్‌ఫర్ బౌల్డ్ చేసి రెండో వికెట్ సాధించాడు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నా శాంసన్ తడబడలేదు. డెవాల్డ్ బ్రెవిస్(21)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఉన్నంతసేపు దంచిన బ్రెవిస్‌కు అశ్వనీ కుమార్ చెక్ పెట్టాడు. ఒకదశలో చెన్నై 180 లోపే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ, డెత్ ఓవర్లలో గేర్ మార్చిన సంజూ.. బుమ్రా ఓవర్లో ఫోర్, భగత్ ఓవర్లో తొలి బంతికి సిక్సర్‌తో తొంభైలోకి వచ్చాడు. అదే ఊపులో బంతిని రెండుసార్లు స్టాండ్స్‌లోకి పంపిన శాంసన్ సెంచరీతో పాటు చెన్నై స్కోర్ రెండొందలు దాటించాడు. సంజూ విధ్వంసంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. భారీ ఛేదనలో ముంబయి టాపార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో 11 పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో సూర్యకుమార్(36), తిలక్ వర్మ(37) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా విఫలం కావడంతో ముంబయి 104 పరుగులకే కుప్పకూలింది. చెన్నై బౌలర్ ఆకెల్ హొసైన్‌కు నాలుగు, నూర్ అహ్మద్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సంజు శాంసన్‌కు దక్కింది.
మాత్రే స్థానంలో మధ్వాల్..
గాయం కారణంగా 2026 ఐపిఎల్‌కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ ఆయుష్ మాత్రే స్థానంలో కీలక ఆటగాడికి చోటు దక్కింది. మూడో స్థానంలో అద్భుతంగా రాణించిన 18ఏళ్ల ఆయుశ్ మాత్రే టోర్నీకి దూరం కావడంతో అతడి స్థానంలో డెత్ ఓవర్ స్పెషలిస్ట్, యువ పేసర్ ఆకాశ్ మధ్వాల్‌కు చోటు కల్పించింది. ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో 17 మ్యాచ్‌లు ఆడిన మధ్వాల్ 23 వికెట్లు పడగొట్టాడు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా సీఎస్కే యాజమాన్యం గురువారం వెల్లడించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కాలి కండరాల నొప్పితో మైదానం వీడిన సంగతి తెలిసిందే. కుడి చేతివాటం పేసరైన మధ్వాల్‌కు సీఎస్కే రూ.30 లక్షలు చెల్లించనుంది. పద్దెనిమిదో సీజన్ వేలంలో రూ.1.20 కోట్లకు ఈ కుర్ర పేసర్‌ను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
స్కోర్‌బోర్డు…
చెన్నై సూపర్‌కింగ్స్: సంజు శాంసన్ (నాటౌట్) 101, గైక్వాడ్ (సి)తిలక్ వర్మ (బి)ఘజన్‌ఫర్ 22, సర్ఫరాజ్ ఖాన్ (సి)సాంట్నర్ 14, దూబే (బి)ఘజన్‌ఫర్ 5, బ్రెవీస్ (సి)బుమ్రా (బి)అశ్వినీ కుమార్ 21, కార్తీక్ శర్మ (సి)సాంట్నర్ (బి)బుమ్రా 18, ఓవర్టన్ (సి)నమన్ ధీర్ (బి)అశ్విని కుమార్ 15, ఆకెల్ హొసైన్ (నాటౌట్) 2, అదనం 9. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 207పరుగులు.
వికెట్ల పతనం: 1/32, 2/72, 3/91, 4/122, 5/165, 6/181
బౌలింగ్: బుమ్రా 4-0-31-1, హార్దిక్ పాండ్యా 2-0-38-0, ఘజన్‌ఫర్ 4-0-25-2, సాంట్నర్ 4-0-44-1, అశ్విని కుమార్ 4-0-37-2.
ముంబయి ఇండియన్స్: డికాక్ (బి)ముఖేష్ చౌదరి 7, మలేవార్ (సి)సంజు (బి)ఆకెల్ హొసైన్ 0, నమన్ ధీర్ (సి)అకెల్ హొసైన్ 0, సూర్యకుమార్ (సి)సర్ఫరాజ్ (బి)అకెల్ హొసైన్ 36, తిలక్ వర్మ (బి)అకెల్ హొసైన్ 37, హార్దిక్ పాండ్యా (సి)ముఖేష్ చౌదరి (బి)నూర్ అహ్మద్ 1, రూథర్డ్‌ఫోర్డ్ (సి)కంబోజ్ (బి)నూర్ అహ్మద్ 0, శార్దూల్ ఠాకూర్ (సి)బ్రెవీస్ (బి)కంబోజ్ 6, కృష్ భగత్ (సి)గుర్జన్‌ప్రీత్ (బి)ఓవర్టన్ 7, అశ్విని కుమార (నాటౌట్) 1, బుమ్రా (సి)సంజు (బి)గుర్జన్‌ప్రీత్ 2, అదనం 7. (19 ఓవర్లలో ఆలౌట్) 104పరుగులు.
వికెట్ల పతనం: 1/7, 2/7, 3/11, 4/84, 5/85, 6/85, 7/87, 8/100, 9/100, 10/104
బౌలింగ్: అకెల్ హొసైన్ 4-1-17-4, ముఖేష్ చౌదరి 4-0-31-1, కంబోజ్ 3-0-10-1, నూర్ అహ్మద్ 4-0-24-2, ఓవర్టన్ 2-0-14-1, గుర్జన్‌ప్రీత్ 2-0-6-1.
సంజు శాంసన్ శతకం
- Advertisement -
- Advertisement -



