జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు..
నవతెలంగాణ – ముధోల్
గ్రామాల పారిశుద్ధ్య నిర్వహణలో సర్పంచ్ ల పాత్ర కీలకమని నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ముధోల్ మండలంలోని తరోడ రైతు వేదికలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలపై ముధోల్ , తానుర్, బాసర, మండలాల సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సర్పంచ్ లకు గ్రామ పరిపాలన అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత కీలకమని వివరించారు.
ఇందుకోసం సర్పంచ్ లు కృషి చేయాలని అన్నారు. గ్రామాల్లో చెత్త సేకరణ అంశంపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని వివరించారు. తడి, పొడి చెత్తలను వేరువేరుగా సేకరించాలన్నారు. చెత్త నుంచి సేంద్రియ ఎరువుల తయారీ, ఆదాయం సృష్టించొచ్చని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి అంకితభావంతో కృషి చేయాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిఆర్డిఓ విజయలక్ష్మి, ముధోల్ ,తానుర్ ,బాసర ఎంపిడిఓ లవన్ కూమార్, దేవేందర్ రెడ్డి, ఎంపిఓలు శివ కుమార్, అమీర్ ఖాన్, గంగా సింగ్, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, కార్యదర్శులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



