Friday, July 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి సర్వే నెంబర్‌కు కొత్త భూధార్ నెంబర్

ప్రతి సర్వే నెంబర్‌కు కొత్త భూధార్ నెంబర్

- Advertisement -

– జిల్లా ఏడిఈ (సర్వే) డి. శ్రీనివాసులు
ఉప్లూర్ రైతు వేదికలో దమ్మన్నపేట గ్రామ రీ-సర్వేపై గ్రామ సభ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ప్రతి సర్వే నెంబర్‌కు కొత్త భూధార్ నెంబర్ ఇస్తామని జిల్లా ఏడిఈ (సర్వే) డి. శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండలంలోని దమ్మన్నపేట రెవెన్యూ గ్రామాన్ని పూర్తి స్థాయిలో రీ-సర్వే చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఉప్లూర్ రైతు వేదికలో ఉప సర్పంచ్ తక్కురి శేఖర్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో పాల్గొన్న జిల్లా ఏడిఈ (సర్వే) డి. శ్రీనివాసులు మాట్లాడుతూ భూ రికార్డులను క్రమబద్ధీకరించడం, దశాబ్దాలుగా ఉన్న భూ వివాదాలను శాశ్వతంగా తగ్గించడం, ప్రతి రైతుకు తమ భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించడమే రీ-సర్వే యొక్క ప్రధాన లక్ష్యమని వివరించారు. దమ్మన్నపేట గ్రామంలోని ప్రతి సర్వే నెంబర్‌ను ఆధునిక పరికరాలతో తిరిగి కొలిచి, డిజిటల్ రికార్డులు రూపొందిస్తామని తెలిపారు. ఇకపై భూ లావాదేవీలు, వారసత్వ హక్కుల విషయంలో ఎలాంటి గందరగోళం ఉండదన్నారు.

రీ-సర్వే ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రతి భూమికి ప్రత్యేకమైన కొత్త భూధార్ నెంబర్ కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఇది ఆధార్ కార్డులా భూమికి ఒక ప్రత్యేక గుర్తింపుగా ఉంటుందని, భవిష్యత్తులో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ భూములకు సంబంధించిన అన్ని సేవలను పొందేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.రీ-సర్వే ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. సర్వే జరిగే ముందు రోజు సంబంధిత రైతుతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా ముందస్తుగా సమాచారం అందజేసి, అందరి సమక్షంలోనే కొలతలు చేస్తామని తెలిపారు.

తహసిల్దార్ నరేష్ మాట్లాడుతూ సర్వే సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు రైతులు తమ భూములకు సంబంధించిన అసలు పత్రాలు, ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని తహసీల్దార్ నరేష్ సూచించారు. రీ-సర్వే ప్రక్రియను ప్రజలు అందరూ సహకరించి విజయవంతం చేయాలని తహసీల్దార్ నరేష్ కోరారు. ప్రభుత్వ ఉద్దేశ్యం రైతులకు మేలు చేయడమేనని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.ఈ సందర్భంగా రైతులు తమ భూముల హద్దులు, వారసత్వ సమస్యలు, కౌలు భూములకు సంబంధించిన పలు సందేహాలు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు ఒక్కొక్కరి సమస్యను ఓపికగా విని, సవివరంగా సమాధానాలు ఇచ్చారు. గ్రామానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ఈ సభకు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

 ఈ గ్రామ సభలో  డిఐ (సర్వే) డి. శేఖర్ వర్మ, సర్వే సూపరింటెండెంట్ ఎం .జగదీశ్వర్, మండల రెవెన్యూ అధికారి శరత్, మండల సర్వేయర్ బాలకృష్ణ హరి,  రెవెన్యూ సిబ్బంది, పెద్ద సంఖ్యలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -