Friday, May 15, 2026
E-PAPER
Homeజిల్లాలు24 ఏళ్ల తర్వాత కుటుంబానికి చేరిన సత్యనారాయణ

24 ఏళ్ల తర్వాత కుటుంబానికి చేరిన సత్యనారాయణ

- Advertisement -
  • కామారెడ్డి పోలీసుల చొరవతో గద్వాల్ వాసి కుటుంబ సభ్యులతో కలయిక

నవతెలంగాణ-కామారెడ్డి: దాదాపు 24 సంవత్సరాల క్రితం తప్పిపోయిన జోగులాంబ గద్వాల్ జిల్లా వాసి సత్యనారాయణ చారి తన కుటుంబ సభ్యులను తిరిగి కలుసుకున్న హృదయాన్ని హత్తుకునే ఘటన కామారెడ్డిలో శుక్రవారం చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల్ జిల్లా పుటాన్‌పల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ చారి (65)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శివశంకర్ కాగా, చిన్న కుమారుడు జ్ఞాన చారి (గణేష్). సత్యనారాయణ చారి సుమారు 24 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి కనిపించకుండా పోయాడు.

గురువారం రాత్రి కామారెడ్డి పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలీస్ కానిస్టేబుల్ అశోక్, హోంగార్డ్ రవి సత్యనారాయణ చారిని గుర్తించి అతని పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం కామారెడ్డి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించగా, అక్కడి నుంచి గద్వాల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం చేరవేశారు. గద్వాల్ పోలీసులు పుటాన్‌పల్లి గ్రామంలో విచారణ చేపట్టి, సత్యనారాయణ చారి గతంలో తప్పిపోయిన విషయం నిజమేనని నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులను కామారెడ్డికి పంపించారు.

శుక్రవారం ఉదయం పట్టణ సీఐ నరహరి సమక్షంలో సత్యనారాయణ చారిని ఆయన కుమారులకు అప్పగించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్ అశోక్, హోంగార్డ్ రవి, పీసీ కమలాకర్ రెడ్డిల సేవలను పట్టణ సీఐ నరహరి అభినందించారు. సత్యనారాయణ కుమారులు పట్టణ సీఐ నరహరికి శాలువా కప్పి సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -