అభ్యుదయవాది సావిత్రమ్మ

అభ్యుదయవాది సావిత్రమ్మ– తెలుగు రాష్ట్రాల సీపీఐ (ఎం) నాయకులు
శ్రీకాకుళం : సీపీఐ(ఎం) అభిమాని సావిత్రమ్మ గొప్ప అభ్యుదయవాది అని పలువురు నాయకులు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం నవభారత్‌నగర్‌ కాలనీలో ఆదివారం నిర్వహించిన సావిత్రమ్మ సంస్మరణ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి సీపీఐ(ఎం) నాయకులు హాజరయ్యారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పిల్లల చిన్నతనంలోనే భర్త చనిపోయినా అధైర్యపడకుండా ముగ్గురు కుమారులను సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. కమ్యూనిస్టు ఉద్యమాల వెనుక మహిళలు విశిష్ట పాత్ర పోషిస్తారనడానికి సావిత్రమ్మ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌. వీరయ్య మాట్లాడుతూ సావిత్రమ్మ తన కుమారులను పార్టీ కోసం పనిచేసేలా ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున, తన తరుపున సావిత్రమ్మ కుటుంబానికి ఆయన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి. జ్యోతి మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలో పని చేయడం వల్లే ఆ కుటుంబం సమాజం పట్ల ఎంతో బాధ్యతగా పని చేసిందన్నారు.
ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, వి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ సావిత్రమ్మ ఆలోచనలు, ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు గపూర్‌, బి.వెంకట్‌ తమ సంతాప సందేశాన్ని పంపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి లోకనాథం, శ్రీకాకుళం, విశాఖ జిల్లా కార్యదర్శులు డి గోవిందరావు, జగ్గునాయుడు, సావిత్రమ్మ కుమారులు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి బాబూరావు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి జయరాం, మరో కుమారుడు పోస్టల్‌ యూనియన్‌ నాయకులు జ్యోతీశ్వరరావు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గన్నారు.

Spread the love