Friday, May 8, 2026
E-PAPER
Homeఖమ్మంఘనంగా “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు”

ఘనంగా “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు”

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట 
స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని శుక్రవారం మద్ది కొండ గ్రామంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా సర్పంచ్ తాటి రామకృష్ణ, ఉపసర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పరిశోధనలను రైతు పొలాల దాకా తీసుకెళ్లేందుకు “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. శాస్త్రవేత్తలు సూచించిన మేలైన యాజమాన్య పద్ధతులను రైతులు అమలు చేస్తే సాగు ఖర్చులు తగ్గడంతో పాటు సుస్థిర దిగుబడులు సాధించవచ్చన్నారు.

అనంతరం డాక్టర్ ఎం. రాంప్రసాద్ మాట్లాడుతూ.. రైతులు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా యూరియాను దఫాల వారీగా అవసరమైన మోతాదులో వేయడం ద్వారా పంట నాణ్యత మెరుగుపడటంతో పాటు చీడపీడల ఉధృతి తగ్గుతుందని తెలిపారు. రసాయనాల వినియోగాన్ని పరిమితం చేసి నేల ఆరోగ్యాన్ని కాపాడాలని, సాగునీటిని పొదుపుగా వినియోగించడం ద్వారా భావితరాలకు నీటి వనరులను సంరక్షించవచ్చన్నారు. డాక్టర్ ఐ. కృష్ణతేజ మాట్లాడుతూ రైతులు విత్తనాలు, ఎరువులు, రసాయనాలు కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రానికి అనుకూలమైన మంచి గిరాకీ కలిగిన వరి విత్తన రకాల లక్షణాలను వివరించారు.

మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు నిరంతరం ఒకే పంట సాగు చేయకుండా కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేపట్టాలని సూచించారు. పంట మార్పిడి వల్ల భూసారం పెరగడంతో పాటు చీడపీడల సమస్యలు తగ్గి దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి సమ్మయ్య రైతులు పంట సాగులో పాటించాల్సిన శాస్త్రీయ మెలకువలను వివరించారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతులు మాట్లాడుతూ “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా శాస్త్రవేత్తల పరిశోధనలను రైతులకు చేరువ చేసే మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్ది కొండ గ్రామ రైతులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -