నవతెలంగాణ – అశ్వారావుపేట : వ్యవసాయ కళాశాల అశ్వారావుపేటకు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్. కె. నాగాంజలి, డాక్టర్. కె. శిరీష ఆధ్వర్యంలో అశ్వారావుపేట మండలం పండువారిగూడెం గ్రామంలో గురువారం “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ సాగు, భూసార పరిరక్షణ, సాగు ఖర్చుల తగ్గింపు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డా. కె. శిరీష మాట్లాడుతూ భూసార పరీక్షల ఆధారంగా సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులు వినియోగించాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతను వివరించి, జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట ఎరువుల వినియోగం వల్ల నేల సారవంతత పెరిగి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.
అలాగే ఆధునిక సాగు విధానాలు అవలంబించడం ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవచ్చని, రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాలని సూచించారు.
డాక్టర్. కె. నాగాంజలి మాట్లాడుతూ “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం ద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానం నేరుగా రైతులకు చేరువవుతుందని తెలిపారు. పంటల మార్పిడి విధానాన్ని పాటించాలని, ఏడాదంతా ఒకే రకమైన పంట సాగు చేయకుండా వరితో పాటు ఆయిల్ పామ్, పప్పుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. జీవ రసాయనాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తూ, తెగుళ్లు మరియు పురుగుల నివారణకు జీవామృతం, ఘనజీవామృతం, వేపనూనె, దశపర్ణి కషాయాలు రైతులు స్వయంగా తయారుచేసుకుని వినియోగించాలని వివరించారు.
ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు నీటి యాజమాన్యం, అంతర పంటల సాగుపై కీలక సూచనలు అందించారు. రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతులు పాటిస్తున్న రైతులను శాస్త్రవేత్తలు అభినందించారు.కార్యక్రమం అనంతరం శాస్త్రవేత్తలు సేంద్రియ ఆకుకూరల సాగు చేస్తున్న రైతు పొలాన్ని, ఆయిల్ పామ్‌లో అంతర పంటలు సాగు చేస్తున్న రైతుల తోటలను సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మండల వ్యవసాయ అధికారి పి. శ్రీనివాసరావు, వ్యవసాయ విస్తరణ అధికారి షకీర భాను సహా స్థానిక అధికారులకు శాస్త్రవేత్తలు కృతజ్ఞతలు తెలిపారు.


