– గణాంక అధికారితో భేటీ
– సమాచారం కోసం లేఖ
– కార్డులు సమర్పించాలని ఆదేశం
– ఇప్పటికే నిజామాబాద్‌లో తనిఖీలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రభుత్వ శాఖల కార్యకలాపాలపై దృష్టిపెట్టింది. పాత బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, పథకాల్లో చోటుచేసుకున్న అవినీతిని వెలికితీసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) పరిధిలో పనిచేసే విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖకు ఆదేశాలు జారీచేశారు. అక్రమాలను బయటపెట్టి విచారణ చేయడం ద్వారా ఎన్నికల్లో ప్రజలకు చెప్పిన వాగ్దానాలను నెరవేర్చాలనే ఆశాభావంతో భావిస్తున్నది. ఇప్పటికే సాగునీటిపారుదల శాఖలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇద్దరు ఉన్నతాధికారులను ఇంటికి పంపిన ప్రభుత్వం, తాజాగా మిషన్ భగీరథలో తీగలాగేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని పౌరులందరికి ఉచితంగా తాగునీటిని అందించేందుకుగాను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేసింది. దాదాపు రూ.35,300 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఇందులో అవినీతి,అక్రమాలు జరిగాయని అరోపణలు, విమర్శలు వచ్చిన నేపథ్యంలో విచారణకు శ్రీకారం చుట్టింది. సహకరించాలంటూ మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు గురువా రం లేఖ రాసింది. ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియకు సంబంధించి రికార్డులు అందజేయాలని విజిలెన్స్ శాఖ కోరింది. నోట్ ఫైళ్లు, టెండర్ ఎవాల్యూయేషన్, టెండరు కమిటీ అనుమతు లు, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్(ఎల్‌ఓఏ) తదితర దస్త్రాలను విచారణకు సమకూర్చాలని కోరింది. ఇంట్రా విలేజ్ నెట్‌వర్క్‌కు చెందిన సర్కులర్లు, జీవోలు ఇతర సమాచారం పంపాలని పేర్కొంది. గత వారం రోజులుగా విజిలెన్స్ విచారణ సాగుతున్నది. తొలుత నిజామాబాద్ ఎస్‌ఈ కార్యాలయంలో విచారించారు. ఆయా పనులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జీరాక్స్ కాపీలను తీసుకున్నారు. అక్కడ జరిగిన పనులు, వ్యయం, ఏమేరకు అవినీతి జరిగిందనే విషయమై ఆరా తీశారు. అలాగే తాజాగా రాసిన లేఖలో నిజామాబాద్‌తోపాటు ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన కాంట్రాక్టులు, ఇతర వివరాలను విజిలెన్ప్ విభాగం అడిగింది. సోలార్ పథకాల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి వివరాలను ఇవ్వాలని భగీరథ శాఖను కోరింది. కాంట్రాక్టర్ల బౌతిక, ఆర్థిక పరిస్థితులకు సంబంధించి అంశాల్లో స్పష్టత అవసరం అని పేర్కొన్నది. ఆడిట్ పేరాల పరిశీలన, సమాధానాల సమాచారం కావాలని అడిగింది. ఈ మేరకు విజిలెన్స్ ఎస్పీ సిహెచ్.శృత కిర్తీ, మిషన్ భగీరథ ఈఎన్సీకి లేఖ రాశారు. కాంట్రాక్టర్లకు పనుల అప్పగింత రికార్డులను ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని 26 సెగ్మెంట్లల్లో భగీరథ పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. పనులు జరిగిన తీరు, బిల్లుల మంజూరు, పనులు ఇచ్చిన విధానం తదితర అంశాలపై గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సోదాల్లో విజిలెన్స్ అధికారులు ఆరా తీస్నున్నది. గురువారం భగీరథ రాష్ట్రకార్యాలయానికి ఇద్దరు విజిలెన్స్ అధికారులు వచ్చి విచారించారు. గణాంక అధికారితో ప్రాజెక్టు వ్యయం, అప్పులు, వడ్డీ తదితర అంశాలపై ఆరా తీశారు. సమాచారం కావాలని అడగడం మినహా ఫైళ్లేవీ స్వాధీనం చేసుకోకపోవడం గమనార్హం.