మ‌త‌త‌త్వ బీజేపీ అవినీతి టీఎంసీల‌ను ఓడించాలి

 Sectarian BJP must defeat corrupt TMCs– బీజేపీ హటావో దేశ్‌ బచావో
– టీఎంసీి హటావో బెంగాల్‌ బచావో
–  అసలు ఆట ఇప్పుడు మొదలైంది
– పోరాటం ఆగదు…వెనక్కి తగ్గేదిలేదు
– దేశంలో నిరుద్యోగం, అవినీతి తీవ్రమైనవి
–  కోల్‌కతాలో డీవైఎఫ్‌ఐ చారిత్రాత్మక ప్రజా బ్రిగేడ్‌ ర్యాలీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జీవనోపాధి సమస్యలను కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఎంసీలు విస్మరించాయని డీవైఎఫ్‌ఐ అఖిల భారత మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ సలీం విమర్శించారు. మత రాజకీయాలు, అవినీతి పద్ధతులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో మతపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టేందుకు కాషాయ క్యాంపుతో టీఎంసీ జతకట్టిందన్నారు. మతతత్వ బీజేపీ, అవినీతి టీఎంసీకి వ్యతిరేకంగా డీవైఎఫ్‌ఐ 50 రోజుల ఇన్సాఫ్‌ యాత్ర (న్యాయం కోసం మార్చ్‌) ముగింపు సభ (పీపుల్స్‌ బ్రిగేడ్‌) కలకత్తాలోని చారిత్రాత్మకంగా బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆదివారం జరిగింది. వేలాది మంది యువత, ప్రజలతో నగరంలోని ఏడు ప్రాంతాల నుంచి ప్రదర్శనలు పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకున్నాయి. బ్రిగ్‌ వద్ద ‘ఇన్సాఫ్‌’ ర్యాలీ భారీ జనసద్రంతో కలకత్తా పుర వీధుల్లో యువత కదం తొక్కారు. ‘బీజేపీ హటావో.. దేశ్‌ బచావో, టీఎంసీ హటావో బెంగాల్‌ బచావో’ అంటూ నినాదాలు చేశారు. ‘పని హక్కు, విద్య హక్కు అమలు కావాలి, అవినీతి, అల్లర్లను తరిమికొట్టాలి, దేశాన్ని, బెంగాల్‌ను కాపాడాలి’ అని నినదించారు. అంతకుముందు కళాకారులు గీతాలు, సంగీత నృత్యాలతో ప్రజలను ఆలోచింపచేశారు.
ఈ సందర్భంగా మహ్మద్‌ సలీం మాట్లాడుతూ రాష్ట్రంలోని టీఎంసీకి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ‘ఒకప్పుడు పాకిస్తాన్‌, పుల్వామా దాడుల పేరుతో జాతీయవాద భావాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన వారు (2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు) ఇప్పుడు కులం, మతాల ఆధారంగా ప్రజల మధ్య విభేదాలను సృష్టిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల జీవనోపాధిని పణంగా పెట్టి కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే ప్రాధాన్యత ఇస్తుంది’ అని ఆయన విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నుండి తమ నాయకులను రక్షించడానికి ‘బీజేపీతో టీఎంసీ అంతర్గత అవగాహన’ కలిగి ఉందని విమర్శించారు.
‘బీజేపీని అవినీతిలో ఉన్న టీఎంసీ ఎన్నటికీ ఎదుర్కోలేదు. సీబీఐ, ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు నుంచి తమ నాయకులను రక్షించడానికి బీజేపీతో రహస్య అవగాహన కలిగి ఉంది. బీజేపీతో టీఎంసీ దానితో పొత్తు పెట్టుకుంది. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో మతపరమైన భావాలను రెచ్చగొట్టేందుకే కాషాయ శిబిరం ఏర్పాటు చేశారు” అని ధ్వజమెత్తారు.
బీజేపీ, టీఎంసీ రెండింటినీ వ్యతిరేకించడానికి పార్టీ నిబద్ధతను పునరుద్ఘాటించిన సలీం, వామపక్షాలు మాత్రమే ప్రజల హక్కులను సమర్ధవంతంగా సమర్థించగలవని ఉద్ఘాటించారు. ‘ఉపాధి హామీ బకాయిలను నిలిపివేయడంపై బీజేపీ, టీఎంసీ మధ్య ఒక నకిలీ సంఘర్షణ ముగుస్తుంది. అయితే, వామపక్షాల ఆలోచనతో ఉపాధి హామీ వచ్చిందన్నారు. పార్లమెంట్‌లో గణనీయమైన సంఖ్యలో వామపక్ష ఎంపీలు ఉన్నప్పుడు ఉపాధి హామీ తీసుకొచ్చామని, వామపక్షాల పట్టుబట్టి చట్టం ఆమోదించారు’ అని గుర్తు చేశారు.
అసలు ఆట ఇప్పుడు మొదలైంది : మీనాక్షి ముఖర్జీ
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి మీనాక్షి ముఖర్జీ మాట్లాడుతూ బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని ఈ మైదానంలో డీవైఎఫ్‌ఐ యాత్ర ముగిసిందని, అయితే తమ అసలు పోరాటం ఇక్కడి నుంచే ప్రారంభమైందని అన్నారు. ‘ఇప్పుడు బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుండే అసలు ఆట మొదలైంది. ఇప్పుడు మనం ఆడాల్సింది ‘టెస్టు మ్యాచ్‌లు’ తప్ప ‘టి-20లు’ కాదు. మొత్తం వ్యవస్థను మార్చేందుకు పోరాడాలి. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి చెందిన ప్రజలు, యువత కోసం పోరాడాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. బీజేపీ, టీఎంసీ విధానాలకు తేడా లేదని విమర్శించారు.
దేశంలో నిరుద్యోగం, అవినీతి తీవ్రమైన సమస్యలు: రహీం, హిమఘ్నరాజ్‌ భట్టాచార్య
డీవైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎఎ రహీం, హిమఘ్నరాజ్‌ భట్టాచార్య మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం, అవినీతి, యవతకు ద్రోహం వంటి వాటి వల్ల యువత కలలు పూర్తి కాలేదని అన్నారు. దేశంలో 23.5 శాతం మంది యువత ఉద్యోగం లేక నిరుద్యోగులుగా ఉన్నారని, అందులో మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీ పక్కింటి వారు ఉన్నారని గుర్తు చేశారు. దేశంలో నిరుద్యోగం, అవినీతి తీవ్రమైన సమస్యలని అన్నారు. ‘మోడీ పకోడిలు వేసుకోమంటున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిండ్లు చేసుకోమంటున్నారు’ అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి అవాస్‌ రారు చౌదరి, డీవైఎఫ్‌ఐ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ధవజ్యోతి సాహా, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి సృజన్‌ భట్టాచార్య తదితరులు ప్రసంగించారు.

Spread the love