Tuesday, June 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతు వేదికల్లో విత్తన మేళాలు

రైతు వేదికల్లో విత్తన మేళాలు

- Advertisement -

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల విత్తనాలపై ప్రత్యేక దృష్టి
2,601 రైతు వేదికల్లో జూన్ 23 నుంచి 30 వరకు నిర్వహణ
ఒకే వేదికపై రైతులకు 
నాణ్యమైన విత్తనాలు
ధ్రువీకరించిన విత్తనాల అమ్మకాలతో అధిక దిగుబడి
రైతులకు వ్యవసాయశాఖ దిశ నిర్దేశం
​నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచు‌కుని వ్యవసాయ శాఖ రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహిస్తున్నది. ‘నాణ్యమైన విత్తనం – అధిక దిగుబడికి పునాది’ అనే లక్ష్యంతో రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది. వర్షాభావ పరిస్థితులను తట్టుకునే ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేలా కార్యచరణను అమలు చేస్తోంది. పప్పు జాతి, నూనె గింజ పంటలను, చిరుధాన్యాలు,కూరగాయ పంటల సాగును ప్రోత్సహించే దిశగా అడుగులేస్తున్నది. ఆయా పంటలకు సరైన విత్తనాలను, నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై అందుబాటులో ఉంచేందుకు రైతు మేళాలు నిర్వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2601 రైతు వేదికల్లో ఈనెల 23 నుంచి 30 వరకు జరుగుతున్న విత్తన మేళాల్లో పాల్గొని విత్తనాలపై అవగాహన పెంచుకోవాలని సూచించింది. వ్యవసాయ శాఖ ధ్రువీకరించిన విత్తనాలను సరసమైన ధరలకు కొనుగోలు చేసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. విత్తన మేళాల్లో పెసర, మినుము, కంది వంటి పప్పుధాన్య పంటల విత్తనాలతోపాటు నువ్వులు, వేరుశెనగ వంటి నూనె గింజల పంటల విత్తనాలు, వివిధ రకాల చిరుధాన్యాలు, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంటాయి. అలాగే సమగ్ర పోషక యాజమాన్యంలో కీలక పాత్ర పోషిస్తున్న నానో యూరియా, నానో డీఏపీ వంటి ఆధునిక ఎరువులను కూడా రైతుల కొనుగోలుకు అందుబాటులో ఉంచుతున్నారు. రైతుల అభిరుచులు, మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్–15048 (తెలంగాణ సోనా), జైశ్రీరామ్, కేఎన్‌ఎం–1638, కేఎన్‌ఎం –7715, డబ్ల్యూజీఎల్–44, హెచ్‌ఎంటీ సోనా వంటి సన్న రకాల విత్తనాలను కూడా అందుబాటులో ఉంచుతున్నది. విత్తన మేళాల సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన శాఖ, శాస్త్రవేత్తలు రైతులకు విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి, సమగ్ర పంట యాజమాన్యం, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, చీడపీడల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన పంటల ఎంపికపై కూడా రైతులకు మార్గదర్శకాలు అందించనున్నారు. విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకుని నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను కొనుగోలు చేసి శాస్త్రీయ సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ సంచాలకులు డాక్టర్ బి. గోపి, ఐఏఎస్ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -