హిమాచల్‌ ప్రదేశ్‌లో కుంభవృష్టి వర్షం.. ఏడుగురు మృతి

నవతెలంగాణ – హిమాచల్ ప్రదేశ్
ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌ను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. గత రెండు నెలలుగా ఆ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. పలు ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. కాగా, సోలన్‌ జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా జాదోన్‌ గ్రామంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మృతి చెందిన వారికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుక్కు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొండ ప్రాంతంలోని అన్ని విద్యాసంస్థలకు ఈరోజు సెలవు ప్రకటించారు. మండి, సిమ్లా, బిలాస్‌పూర్‌ జిల్లాల్లోని 621 రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. అదేవిధంగా భారీ వర్షాల దృష్ట్యా పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శితో పాటు అన్ని డీసీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Spread the love