శిథిలాల కింద ఇద్దరు కార్మికులు మృతి
50 గజాల స్థలంలోనే భారీ నిర్మాణం
పరారైన బిల్డర్..పోలీసుల గాలింపు
నవతెలంగాణ-మాదాపూర్
హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాలా పక్కనే 50 గజాల స్థలంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు నిర్మాణ కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్ స్వల్పంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది భారీ యంత్రాలతో శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికితీశారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. అంజయ్యనగర్‌లో నిర్మాణం పూర్తి చేసి అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఓ భవనం శనివారం మధ్యాహ్నం ఒంటిగంట
సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శిథిలాల కింద ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు చిక్కుకుని ప్రాణం కోల్పోయారు. దాంతోపాటు భవనం శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడటంతో అది కూడా పాక్షికంగా దెబ్బతింది. అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఇద్దరు వృద్ధులు గాయపడినట్టు సమాచారం. గోడలు, నిర్మాణ భాగాలు దెబ్బతినడంతో నివాసితులు భయంతో బయటకు పరుగులు తీశారు. పక్కనే ఉన్న హాస్టల్ విద్యార్థులు కూడా భయాందోళనకు గురై బయటకు వచ్చారు.
రంగంలోకి రెస్క్యూ బృందాలు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్ఆర్ఎఫ్, సీఎంసీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగించి ఇద్దరు కార్మికుల మృతదేహాలను వెలికితీశాయి. వారిని మధ్యప్రదేశ్‌కు చెందిన టైల్స్ కార్మికులు ఉమేశ్ కారే (34), మోపత్ (42)గా అధికారులు గుర్తించారు. శిథిలాల కింద మరెవరైనా చిక్కుకుని ఉన్నారా అనే అనుమానంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇదే ప్రమాదం సాయంత్రం సమయంలో జరిగి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. నిబంధనలను తుంగలో తొక్కి నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. ‘‘ఇలాంటి భవనాలు ఇక్కడ చాలా ఉన్నాయి.. వాటిని హాస్టళ్లకు ఇస్తున్నారు.. వాటిని ఖాళీ చేయాలని యజమానులకు సూచిస్తున్నాం.. కొద్ది రోజుల్లో ఇలాంటి భవనాలన్నింటినీ కూల్చేస్తాం.. నాలాను ఆక్రమించి ఇష్టానుసారంగా భవనాలు కట్టారు.. అంజయ్యనగర్‌లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం’’ అని చెప్పారు.
అనుమతులు లేకుండానే నిర్మాణమా?
ఈ భవనం నిర్మాణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంసీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్కువ వ్యవధిలోనే భారీ అంతస్తులు నిర్మించడంతోనే భవనం బలహీనంగా మారి కుప్పకూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా అంజయ్యనగర్, సిద్ధిక్‌నగర్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని స్థానికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
బిల్డర్ కోసం పోలీసుల గాలింపు
భవనం నిర్మాణానికి సంబంధించిన బిల్డర్ సాజిద్ ఘటన జరిగిన వెంటనే పరారైనట్టు సమాచారం. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిసింది. భవనానికి అనుమతులు ఉన్నాయా? నిర్మాణంలో నిబంధనలు పాటించారా? నిర్మాణ నాణ్యతను ఎవరు పర్యవేక్షించారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.



