నిషేధిత జాబితాలో వందల ఎకరాలు ఎక్కువగా పట్టా భూములే
ఏ గ్రామంలో చూసినా
పెద్ద ఎత్తున నమోదు
తెలియక ఇబ్బందులు పడుతున్న
భూ యజమానులు
రెవెన్యూ కార్యాలయాలకు
పరుగులు పెడుతున్న రైతులు
22ఏ సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
వ్యవసాయ పట్టా భూములు నిషేధిత జాబితాలో చేరడంతో భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు పట్టా హక్కులు ఉన్నప్పటికీ, రిజిస్ట్రేషన్ సమయంలో ఆ భూములు నిషేధిత జాబితాలో ఉన్నట్టు తెలియడంతో క్రయవిక్రయాలు నిలిచిపోతున్నా యని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల ఎకరాల్లో రైతుల వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు 22ఏ చేరడంతో రెవెన్యూ అధికారులపై భూ యజమానులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. పట్టాపాసు పుస్తకాల్లో రైతులకు సంబంధించిన భూములు పట్టాభూములు ఉంటే పట్టాభూములుగా, అసైన్డ్, ప్రభుత్వ భూములుంటే ప్రభుత్వ భూములుగా నమోదు చేసి పట్టా సర్టిఫికెట్లను అధికారులు అందజేశారు. కానీ రైతులు ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పట్టా భూములను విక్రయించేందుకు కుటుంబ అవసరాల కోసం ఇతరులకు బదలాయించేందుకు ప్రయత్నించిన సమయంలో నిషేధిత జాబితాలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారని పలువురు భూ యజమానులు ఆవేదన చెందుతున్నారు. ఎలాంటి సమాచారం లేకపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. కొందరు ఇప్పటికే ఒప్పందాలు చేసుకుని, అడ్వాన్సులు తీసుకున్న తర్వాత ఈ విషయం బయటపడటంతో ఆర్థికంగా నష్టపోతున్నారని చెబుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులు రైతుల పట్టాభూములను నిషేదిత జాబాతా22(ఏ)లో చేర్చారు. సంగారెడ్డి మండల పరిధిలోని కులబ్‌గూర్ గ్రామంలో మొత్తం 104.925 ఎకరాలు నిషేదిత జాబితాలో నమోదయ్యాయి. 120.2225 ఎకరాల ప్రభుత్వ భూములను సైతం నిషేదిత జాబితాలో చేర్చారు. కంది మండలంలో వ్యవసాయ భూములను నిషేదిత జాబితాలో నమోదు చేశారు. అమీన్‌పూర్ 171 సర్వేనంబర్లను నిషేదిత జాబితాలో వ్యవసాయ భూములు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో 705 సర్వేనంబర్లను నిషేదిత జాబితాలో చేర్చారు. సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని చింతమడకలో, మిరుదొడ్డి మండలం అందె గ్రామంలోనూ సర్వేనంబర్లు నిషేదిత జాబితాలో ఉన్నాయి.
ఇలా పలు గ్రామాల్లో వందల ఎకరాల వ్యవసాయ భూములు నిషేధిత జాబితాలో నమోదైనట్టు భూ యజమానులు ఆరోపిస్తున్నారు. ఒక గ్రామానికే పరిమితం కాకుండా పలు గ్రామాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. అసలు ఏ కారణంతో తమ పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చారు? ఎవరి ఆదేశాలతో నమోదు చేశారు? అనే విషయాలపై స్పష్టత లేకపోవడంతో భూ యజమానుల్లో అయోమయం నెలకొంది. రెవెన్యూ రికార్డులు, పట్టాదారు పాస్‌బుక్‌లు, భూమి వివరాలను సమగ్రంగా పరిశీలించి అర్హత ఉన్న వ్యవసాయ పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని బాధితులు కోరుతున్నారు. నిషేధిత జాబితాలో భూముల నమోదుకు సంబంధించిన వివరాలను గ్రామాల వారీగా బహిర్గతం చేయడంతో పాటు, తప్పుగా నమోదైన భూములకు త్వరితగతిన పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలి.అధికారులు వివరణ ఇవ్వాలి
వ్యవసాయ పట్టా భూములు నిషేధిత జాబితాలోకి ఎలా వచ్చాయన్న దానిపై రెవెన్యూ అధికారులు స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలించి, నిజమైన పట్టాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూములపై హక్కులు, లావాదేవీకు అవకాశం కల్పించాలి.
నర్సమ్మ, మెదక్ జిల్లా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
అధికారుల తప్పిదంతోనే పొరపాట్లు
ధరణి వచ్చిన కాలంలో అధికారులు వారి స్వలాభం కోసం రైతుల పట్టాభూములను నిషేదిత జాబితాలో చేర్చారు. భూ యజమానులకు ముందస్తు సమాచారం లేకుండా రికార్డుల్లో మార్పులు జరిగితే వాటిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పట్టాభూములను ఏ విధంగా నిషేధిత జాబితాలో చేరుస్తారు. రెవెన్యూశాఖ మంత్రి స్వయంగా తమ అధికారుల తప్పిదం వల్లనే జరిగిందని ప్రకటించారు. పేదల భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలి.
జయరాజ్, సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి
ధరణి నుండి భూ భారతి వరకు అవే లోపాలు
గతంలో ధరణి తీసుకువచ్చి వందల ఎకరాలను నిషేదిత జాబితాలో చేర్చారు. అంతే కాకుండా నిజమైన భూ యజమానులకు తెలియకుండా ఇతరుల పేర్లపై రెవెన్యూ అధికారులు మార్చారు. అంతే కాకుండా పేదల భూములతో పాటు ఇండ్లను సైతం నిషేధిత జాబితాలో చేర్చారు. కొంతమంది రెవెన్యూ అధికారుల ధనదాహం వల్లనే ఇలా చేశారు. అవసరాల కోసం తమ భూములను అమ్ముకోవాలని తహసీల్దార్ కార్యాలయాలకు వెళితే నిషేధిత జాబితాలో ఉన్నాయని చెబుతున్నారు.
ఆముదాల మల్లారెడ్డి, సిద్దిపేట జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి



