రాజకీయాల్లో లైంగిక వేధింపులు

Sexual harassment in politics– ప్రజ్వల్‌ రేవణ్ణ ఉదంతం ఓ ఉదాహరణ మాత్రమే
– వెలుగు చూడని అకృత్యాలు ఎన్నో
– కింది స్థాయి మహిళల పరిస్థితి మరింత దారుణం
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో వెలుగులోకి వచ్చిన ప్రజ్వల్‌ రేవణ్ణ రాసలీలల బాగోతం దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపింది. ప్రజ్వల్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ పలువురు బాధిత మహిళలు గళం విప్పి తమ ఆవేదనను, ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో రాణించాలనుకునే మహిళలు లైంగిక వేధింపులకు గురవడం సర్వసాధారణమేనని, వారి గోడును పట్టించుకునే నాథుడే ఉండడని మైసూరుకు చెందిన కాంగ్రెస్‌ నాయకురాలు నజ్మా నజీర్‌ వాపోయారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉండడం కూడా ఈ పరిస్థితికి కారణమవుతోంది.
కొత్తగా ఎన్నికైన 18వ లోక్‌సభలో కేవలం 74 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. మొత్తం సభ్యుల్లో వీరి భాగస్వామ్యం 14శాతం కంటే తక్కువే. 2019లో జరిగిన ఎన్నికల్లో 78 మంది మహిళలు విజయం సాధించారు. అంటే ఇప్పుడు దిగువసభలో మహిళా ప్రాతినిధ్యం గతంలో కంటే మరింత తగ్గిందన్న మాట.
అక్కడ వారిదే రాజ్యం
హసన్‌లో పలువురు మహిళలు ప్రజ్వల్‌ చేతిలో లైంగిక వేధింపులకు గురవడానికి ప్రధాన కారణం హెచ్‌డీ దేవెగౌడ కుటుంబానికి ఉన్న ప్రాబల్యమే. ఆ కుటుంబం కర్నాటకలో గట్టి పట్టున్న, శక్తివంతమైన ఒక్కళిగ సమాజానికి చెందినది. హసన్‌ నుండి దేవెగౌడ మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన కుమారుడైన హెచ్‌డీ కుమారస్వామి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. దేవెగౌడ మరో కుమారుడైన రేవణ్ణ ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. రేవణ్ణ కుమారుడైన ప్రజ్వల్‌ 2019లో రాజకీయాల్లో ప్రవేశించి, హసన్‌ లోక్‌సభ స్థానం నుండి విజయం సాధించారు. దేవెగౌడను ఆ ప్రాంతంలో అందరూ ఎంతగానో గౌరవిస్తారు. అయితే ఆయన కుమారులు, మనవళ్లపై స్థానికుల్లో భిన్నాభిప్రాయలు ఉన్నాయి. కుమారుల కారణంగా దేవెగౌడ సైతం అప్రదిష్టను మూటకట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా రేవణ్ణ చాలా దుందుడుకు స్వభావం కలిగిన నాయకుడని అంటారు.
హసన్‌ జిల్లాను స్థానికులు ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ రేవణ్ణ’ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఆయన అనుమతి లేకుంటే అక్కడ ఏమీ జరగదని నజ్మా నజీర్‌ చెప్పారు. ఆమె గతంలో జనతాదళ్‌ (ఎస్‌) మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. రెండు నెలల క్రితమే కాంగ్రెస్‌లో చేరారు. రేవణ్ణ కుటుంబంలో ఎవరు ఎన్ని తప్పులు చేసినా నోరు మెదిపే ధైర్యం ప్రజలకు లేదు. అదే ప్రజ్వల్‌ రేవణ్ణను కామాంధుడిగా మార్చింది. పైగా రేవణ్ణకు కులాభిమానం ఎక్కువ. ఈ రోజుకు కూడా దళితులతో మాట్లాడిన తర్వాత ఆయన స్నానం చేస్తారట.
అన్ని పార్టీల్లోనూ లైంగిక వేధింపులు
హసన్‌లో కింది స్థాయి రాజకీయాల్లో ఉన్న మహిళలు శక్తివంతమైన నేతల చేతిలో దారుణమైన అవమానాలు చవిచూశారు. కర్నాటకలో ‘మహిళలు-రాజకీయాలు’ అనే అంశంపై మాస్టర్‌ డిగ్రీ కోసం సుష్మా మహాబాల గత ఐదు సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నారు. వివిధ పార్టీల్లో ఉన్న మహిళలను ఆమె సంప్రదిస్తూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. లైంగిక వేధింపులు అన్ని పార్టీల్లోనూ జరుగుతూనే ఉన్నాయని ఆమె గ్రహించారు. అయితే తమను వేధించిన రాజకీయ నాయకుల పేర్లను కర్నాటక మహిళలు బయటపెట్టడం లేదు. మహిళలు రాజకీయ ప్రచారానికో లేదా ఇతర కార్యక్రమానికో రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాత వెళితే వారిని గౌరవంగా చూడరని మహాబాల చెప్పారు.
న్యాయస్థానం కూడా…
పని ప్రదేశంలో మహిళలను లైంగికంగా వేధించడం చట్టప్రకారం నేరం. ‘పని ప్రదేశం’ అనే మాటకు చట్టం విస్తృతమైన నిర్వచనం ఇచ్చింది. అయితే రాజకీయ పార్టీలు దీని పరిధిలోకి రావు. దీనిని సవాలు చేస్తూ 2018లో కోజికోడ్‌కు చెందిన న్యాయవాది సంధ్యా రాజు కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌కు అనుకూలంగా 2022లో కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ అది పాక్షికంగానే ఉంది. రాజకీయ పార్టీల సభ్యుల మధ్య యజమాని-ఉద్యోగి సంబంధాలు ఉండవని, కాబట్టి అది పని ప్రదేశం పరిధిలోకి రాదని కోర్టు అభిప్రాయపడింది.
పక్కన నిలబడితేనే వ్యక్తిత్వ హననం
రాజకీయాల్లో లైంగిక వేధింపులు మితిమీరిపోతున్నాయని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కవితా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శక్తివంతులైన పురుషులతో కలిసి మహిళలు పనిచేయాల్సి ఉంటుందని, ఈ క్రమంలో వారు లైంగిక వేధింపులకు గురవుతుంటారని ఆమె చెప్పారు. ‘ఒక ఫోన్‌ కాల్‌తో మీ జీవితమంతా నాశనమవుతుంది’ అని అన్నారు. మహిళలు పురుషుల పక్కన నిలబడగానే వ్యక్తిత్వ హననం మొదలవుతుందని చెప్పారు. ‘పురుషులు మహిళలను గౌరవించరు. యువతరం కొంత నయం. కానీ ప్రజ్వల్‌ రేవణ్ణ వంటి వారిని కూడా మనం చూస్తుంటాం’ అని తెలిపారు. రాజకీయ కుటుంంబాల నుండి వచ్చిన మహిళలకు కొంత రక్షణ ఉంటుందని మహాబాల అన్నారు. మిగిలిన వారిలో ఎవరినైనా లైంగిక వేధింపులకు గురిచేయవచ్చునని, అవివాహితులు, వితంతువులకు ఈ బెడద మరింత అధికంగా ఉంటుందని ఆమె చెప్పారు.
ఇప్పుడిప్పుడే భయం తగ్గుతోంది : సీపీఐ (ఎం)
‘రాజకీయాల్లో దేవెగౌడ లౌకికవాది, సోషలిస్టు కావచ్చు. కానీ వ్యక్తిగత జీవితంలో ఆయన ప్రవర్తన వేరేలా ఉంటుంది’ అని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి ధర్మేష్‌ వ్యాఖ్యానించారు. ఆ కుటుంబానికి మతతత్వం, కులాభిమానం ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఒక్కళిగుల ప్రాబల్యం కారణంగా దేవెగౌడ కుటుంబం దశాబ్దాల తరబడి అధికారాన్ని అనుభవిస్తోంది. వారికి పెద్ద ఎత్తున ఆస్తులు, భూములు ఉన్నాయని, వారు చాలా శక్తివంతులన్న విషయం స్థానికులకు తెలుసునని, అందుకే ఆ కుటుంబానికి భయపడుతుంటారని ధర్మేష్‌ చెప్పారు. అయితే గత రెండేండ్లలో ఆ భయం కొంతవరకూ తగ్గిందని అన్నారు.
దిగువ స్థాయి ఉద్యోగినులే లక్ష్యంగా…
ప్రభుత్వంలో కింది స్థాయిలో పనిచేస్తున్న మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ప్రజ్వల్‌ రేవణ్ణ జిల్లా పరిషత్‌, తాలూకా, గ్రామ పంచాయతీ స్థాయిల్లో పనిచేసే దిగువ శ్రేణి మహిళా ఉద్యోగినులనే లక్ష్యంగా చేసుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఉద్యోగాలు, బదిలీలు, తమ భర్తల కోసం పనుల కోసం తనను కలిసే మహిళలను ప్రజ్వల్‌ వేధించేవాడు. ఉన్నతోద్యోగాలు చేసే మహిళల జోలికి మాత్రం రాజకీయ నాయకులు అంత సులభంగా వెళ్లరు.

Spread the love