ఢిల్లీకి గులాములవుదామా?

Shall we be slaves to Delhi?– రానున్నది ప్రాంతీయ పార్టీల యుగం
– ప్రజాస్వామ్యంలో మాటలకూ పరిమితుంది..
– సింగరేణి తెలంగాణ సొత్తు..
– సీతారామ ప్రాజెక్టుతో జిల్లా బంగారు తునక : ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌
– ప్రతి ఎన్నికల్లో పార్టీ మారే వ్యక్తి తుమ్మల : అజయ్
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
‘ఢిల్లీ గులాముల కింద ఉండే పార్టీకి ఓటేసి గులాములు అవుదామా..? రాబోయేది ప్రాంతీయ పార్టీల యుగం.. ఎక్కడోళ్లు అక్కడ పాలించుకుంటేనే ఉత్తమం’ అని బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. బీఆర్‌ఎస్‌ ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో మాటలకు పరిమితి ఉందన్నారు. ఓ అర్భకుడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనీయనని అంటున్నాడు.. ఖమ్మాన్ని ఆయన కొనేశాడా అని ప్రశ్నించారు. ఒకాయన నేను మంత్రి పదవి ఇచ్చానంటే.. ఆయనే నాకు మంత్రి పదవి ఇచ్చాను అంటున్నాడు.. ఎవరికి ఎవరు మంత్రి పదవి ఇచ్చారో మీకు తెలియదా అని ప్రశ్నించారు. పువ్వాడను గెలిపిస్తే పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారని, తుమ్మలకు ఓటు వేస్తే తుమ్మముళ్ల పాలుజేస్తారని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలు చైతన్యం తెచ్చిన నేల ఇది అన్నారు. ఓటును సరైన పద్ధతిలో వాడాలని సూచించారు. నాడు ఖమ్మం ఇరుకు సందులు, మురికి కాల్వలతో ఉండేదని, ఇప్పుడు రోడ్లు, లైట్లు, పచ్చని చెట్లతో సుందరంగా ఉందన్నారు. ఇదంతా మంత్రి అజయ్ కృషి ఫలితమేనని తెలిపారు. ఖమ్మం నగరంలో 1500 కి.మీ రోడ్లు, 1592 కి.మీ డ్రయినేజీలు నిర్మించామన్నారు. నూతన బస్టాండ్‌, ఐటీ హబ్‌ ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. మున్నేరు వరదల నుంచి విముక్తి కోసం రూ.700 కోట్లు మంజూరు చేయించుకున్నారని తెలిపారు. ప్రతి ఎన్నికల్లో పార్టీ మారే వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు అని బీఆర్‌ఎస్‌ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజరు కుమార్‌ అన్నారు. సభలో బీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీలు బండి పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, బీఆర్‌ఎస్‌ సత్తుపల్లి, పాలేరు, మధిర, వైరా నియోజకవర్గాల అభ్యర్థులు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్‌ రెడ్డి, లింగాల కమల్‌ రాజ్‌, బాణోత్‌ మదన్‌ లాల్‌, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, మేయర్‌ పునుకొల్లు నీరజ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మెన్లు కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి తెలంగాణ సొత్తు..
కొత్తగూడెం సింగరేణి ప్రకాశం మైదానంలో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. నల్ల బంగారమైన సింగరేణి తెలంగాణ సొత్తుని, చేతకాని కాంగ్రెస్‌ నాయకుల కారణంగా కేంద్రానికి 49 శాతం వాటా ఇవ్వాల్సి వచ్చిందని, సీతారామ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా బంగారు తునక అవుతుందని అన్నారు. రాష్ట్రంలో 134 ఏండ్ల చరిత్ర ఉన్న సింగరేణి పూర్తిగా తెలంగాణ ఆస్తి అని అన్నారు.
తెలంగాణ రాక ముందు సింగరేణి లాభాలు రూ.419 కోట్లు మాత్రమే ఉండేదని, తెలంగాణలో రూ. 2124 కోట్లకు తీసుకు పోయామని తెలిపారు. నూతన నియామకాల వల్ల యువ ఉద్యోగులతో కళకళ లాడుతుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో డిపెండెంట్‌ ఉద్యోగాలు తీసి వేసిందని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 15,256 మందికి డిపెండెంట్‌ ఉద్యోగాలు కల్పించిట్టు చెప్పారు. గని కార్మికుడు చనిపోతే కేవలం రూ.1 లక్ష మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు రూ.10 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. జిల్లాలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని బేరీజు వేసుకొని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును గెలిపించాలని కోరారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయని, వచ్చేది మన ప్రభుత్వమేనని మిగిలిన పనులు పూర్తిచేసి తానే ప్రారంభిస్తానని చెప్పారు.
జిల్లాలో 16,769 ఎకరాల పోడు భూములను 4500 మంది గిరిజన కుటుంబాలకు పట్టాలు ఇచ్చామని చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎంపీలు నామ నాగేశ్వరరావు. పార్థసారధిరెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, ఎమ్మెల్యే అభ్యర్థులు వనమా వెంకటేశ్వరరావు, బి.హరిప్రియ, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love