– రాజస్థాన్‌లో ‘అశుద్ధం’ పేరిట రామమందిర విరాళాలు వెనక్కి
– దళిత సంఘాల ఆగ్రహం
జైపూర్ : అయోధ్యలో రామ మందిరం పేరిట వేల కోట్ల విరాళాలు వసూలయ్యాయి. ఈ నేపథ్యంలో రామ మందిర ప్రారంభోత్స వంలో భాగంగా అనేక కార్యక్రమాలు జరు గుతున్నాయి. సెక్యులర్ భావనను సైతం లెక్క చేయకుండా కేంద్రంలోని మోడీ సర్కారు, బీజేపీ ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాయి. కాగా, రాజస్థాన్‌లోనూ ‘అయోధ్య’కు విరాళాలు వసూలయ్యాయి. అయితే ఈ విషయంలో అక్కడి దళితులకు తీవ్ర అవమానం ఎదురైంది. రామ మందిర ఆచారాల కోసం తాము ఇచ్చిన విరాళాలను అశుద్ధం పేరిట తిరిగి తమకే ఇచ్చారని ఝలవార్ జిల్లాలోని దళితులు ఆరోపించారు. పెత్తందారీ కులాలకు చెందిన వ్యక్తులు ఇలా చేశారని తెలిపారు. ఈ నెల 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామ మందిర ఆచారాల నిర్వహణ కోసం నిధులకు పెత్తందారీ కులాలకు చెందిన వ్యక్తులే తమను సంప్రదించి చివరకు ఇలా చేశారని దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పక్షపాతం, వివక్ష’కు గురి చేశారని దళితులు జిల్లా యంత్రాంగానికి సైతం ఈనెల 11న ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఘటన 9న జరిగినట్టు దళితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పెత్తందారీ కులాలకు చెందిన వ్యక్తుల తీరుపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధితులపై కఠిన చర్యలకు డిమాండ్ చేశాయి.