వసుంధర రాజేకు షాక్‌..?

వసుంధర రాజేకు షాక్‌..?– రాజస్థాన్‌ టిక్కెట్ల పంపిణీలో మొండిచేయి
జైపూర్‌ : ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన.. కొద్ది గంటలకే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు 41 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి జాబితాను విడుదల చేసింది.అయితే మాజీ సీఎం వసుంధరా రాజేను పక్కన బెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి పదవి కోసం ఏ నాయకుడి ముఖాన్ని ప్రదర్శించకుండా రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని నడ్డా-షా సమావేశంలో ప్రకటించినపుడే వసుంధరా సీటుపైనే అనుమానాలు తలెత్తాయి.
వసుంధరా మద్దతు దారులకు నిరాశే..
ఈ జాబితాలో ప్రకటించిన 41 మంది అభ్యర్థుల్లో 31 మంది కొత్త ముఖాలు. మహారాణి దియా కుమారి, రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ పేర్లతో సహా ఏడుగురు ఎంపీలకు కూడా పార్టీ టిక్కెట్లు ఇచ్చింది. అదే సమయంలో టికెట్‌ ఆశించిన మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మద్దతుదారులు చాలా మంది నిరాశకు గురయ్యారు.

బీజేపీ తొలిజాబితాలో టికెట్లు కోల్పోయిన నేతల్లో.. రెండుసార్లు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మద్దతుదారుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్టు సమాచారం. దీనిపై రాజస్థాన్‌ రాజకీయాల్లో కలకలం రేగింది. టికెట్‌ రద్దుపై ఆగ్రహంతో అరడజను మందికి పైగా నాయకులు లేదా వారి మద్దతుదారులు బహిరంగ నిరసనకు దిగారు. జైపూర్‌లోని జోత్వారా స్థానం నుంచి రాజ్‌పాల్‌ సింగ్‌ షెకావత్‌ టికెట్‌ను బీజేపీ రద్దు చేసి కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌కు టికెట్‌ ఇచ్చింది. రాథోడ్‌కు టికెట్‌ ఇవ్వడాన్ని జోత్వారా బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకించారు.
సంచోర్‌ స్థానం నుంచి ఎంపీ దేవ్‌జీ పటేల్‌కు బీజేపీ టికెట్‌ ఇచ్చింది. సంచోర్‌లో కూడా దేవ్‌జీని వ్యతిరేకిస్తున్నారు. నివేదికల ప్రకారం, దేవ్‌జీ పటేల్‌ కాన్వారులో ఉన్న వాహనాలపై రాళ్లు రువ్వడం , ధ్వంసం చేసిన సంఘటన కూడా జరిగింది. ఈ ఘటన వెనుక తన ప్రత్యర్థుల కుట్ర ఉంటుందన్న భయాన్ని దేవ్‌జీ వ్యక్తం చేశారు.

భరత్‌పూర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనితా సింగ్‌కు, మాజీ ఉపరాష్ట్రపతి భైరవ్‌ సింగ్‌ షెకావత్‌ బంధువు విద్యాధర్‌ నగర్‌ ఎమ్మెల్యే నర్పత్‌ సింగ్‌ రాజ్‌వీకి కూడా బీజేపీ టిక్కెట్‌ ఇచ్చింది. నార్పట్‌ స్థానం నుంచి మహారాణి దియా కుమారిని బీజేపీ అభ్యర్థిగా చేసింది. ఇద్దరు నాయకులు అనితా సింగ్‌ , నర్పత్‌ వసుంధరకు దగ్గరగా ఉన్నారు. నర్పత్‌ అసంతృప్తి వార్త రాగానే, బీజేపీ రాజస్థాన్‌ ఇన్‌చార్జి అరుణ్‌ సింగ్‌ వారిని కలవడానికి వచ్చారు. దియా కుమారి నర్పత్‌ను ఆశీర్వదించమని విజ్ఞప్తి చేసింది. భైరవ్‌ సింగ్‌ నాకు కూడా తండ్రి లాంటిదని చెప్పింది.

టిక్కెట్ల ప్రకటన తర్వాత టికెట్‌ రాని అనితా సింగ్‌, రాజ్‌పాల్‌ సింగ్‌ షెకావత్‌లు కూడా మాజీ సీఎం వసుంధరను కలిశారు. వసుంధరతో పలువురు నేతలు కూడా భేటీ అయినట్టు చర్చ జరుగుతోంది. నేను వసుంధరకు మద్దతుగా ఉన్నందున పార్టీ నాకు టిక్కెట్‌ ఇవ్వకపోవటంతో బీజేపీ నాయకత్వంపై అనిత ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వసుంధర మద్దతుదారుల టిక్కెట్లు రద్దు చేసి, దియా కుమారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. దీంతో రాజస్థాన్‌లో టిక్కెట్ల పంపిణీ వసుంధర రాజేకి నిజంగా ఎదురుదెబ్బ కాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికి ఎవరికీ మొహం పెట్టుకోకుండా పోటీ చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించినందున ఈ ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. రాజస్థాన్‌ ఎన్నికల్లో కమలమే మా నాయకుడని స్వయంగా ప్రధాని మోడీ వేదికపై నుంచి ప్రకటించారు. 1998 తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర నాయకత్వానికి ముఖం లేకుండా బీజేపీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి కావటం గమనార్హం.
వసుంధరకు ఉన్న ఒత్తిడి రాజకీయాల దృష్ట్యా, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆమె వైపు చూడాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్టు కూడా చర్చ జరిగింది. పార్టీ పోస్టర్లలో వసుంధర చిత్రం కనిపించకుండా పోవడంతో పాటు ప్రత్యర్థి సతీష్‌ పునియాను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఎన్నికల సంవత్సరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చి వసుంధర కూడా పోస్టర్లపై తిరిగారు. ప్రధాని మోడీ, హౌంమంత్రి అమిత్‌ షా కార్యక్రమాల్లో వసుంధర వేదికపై కనిపించటం మొదలుపెట్టారు. అయితే పార్టీ ఆమె ముఖాన్ని ఎన్నికల్లో ముందుకు తేకుండా తప్పించుకుంది. నాయకత్వం గురించి చర్చ ప్రారంభమైనప్పుడు, వసుంధర కూడా పరివర్తన్‌ యాత్రలకు దూరంగా ఉంది. జైపూర్‌ చేరుకున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌ షా.. వసుంధరతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
అయితే ఇప్పుడు బీజేపీ తొలిజాబితాలోనే పలువురు మద్దతుదారుల టిక్కెట్లు కోతపడడంతో వసుంధర ఆగ్రహంతో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే వసుంధర ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు, అసహనం వ్యక్తం చేయలేదు. బీజేపీ తొలి జాబితా వెలువడిన తర్వాత ఈ జాబితాలో చోటు దక్కని నేతలను వసుంధర రాజే సముదాయించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రాజస్థాన్‌లో రాజకీయాలు వేడెక్కాయి.

Spread the love