జకోవిచ్‌కు షాక్‌

Shock for Djokovic– చిలీ ఆటగాడి చేతిలో చిత్తు
– మోంటోకార్లో మాస్టర్స్‌ టెన్నిస్‌
రోక్యూబృనే కాప్‌ మార్టిన్‌ (ఫ్రాన్స్‌): టెన్నిస్‌ దిగ్గజం, సెర్బియా యోధుడు నొవాక్‌ జకోవిచ్‌కు మళ్లీ షాక్‌ తగిలింది. మోంటోకార్లో మాస్టర్స్‌ ఏటీపీ 1000 టోర్నమెంట్‌లో నొవాక్‌ జకోవిచ్‌ రెండో రౌండ్లోనే పరాజయం పాలయ్యాడు. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్‌ జకోవిచ్‌ గురువారం జరిగిన మ్యాచ్‌లో వరుస సెట్లలో ఓటమి చెందాడు. 27 ఏండ్ల యువ చిలీ ఆటగాడు అలెగ్జాండ్రో తబిలో 6-3, 6-4తో జకోవిచ్‌పై అద్భుత విజయం సాధించాడు. రెండు ఏస్‌లు, మూడు బ్రేక్‌ పాయింట్లతో మెరిసిన అలెగ్జాండ్రో..24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేతను మట్టికరిపించాడు. జకోవిచ్‌ మూడు ఏస్‌లు కొట్టినా.. ఒక్క బ్రేక్‌ పాయింట్‌తోనే సరిపెట్టుకున్నాడు. పాయింట్ల పరంగా 66-49తో తబిలో ఆధిపత్యం నిరూపించుకుని ముందంజ వేశాడు. రష్యా స్టార్‌, తొమ్మిదో సీడ్‌ డానిల్‌ మెద్వదేవ్‌ 7-6(8-6), 5-7, 6-2తో అలెగ్జాండ్ర ముల్లర్‌పై విజయం సాధఙంచాడు. ఏడు ఏస్‌లు, ఐదు బ్రేక్‌ పాయింట్లతో మెద్వదేవ్‌ మూడు సెట్ల మ్యాచ్‌లో మెప్పించాడు. గ్రిగర్‌ దిమిత్రోవ్‌ 4-6, 6-3, 6-1తో వాలెంటిన్‌పై గెలుపొందగా.. నాల్గో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ 6-2, 6-1తో రాబర్టో బటిస్టాపై అలవోక విజయం నమోదు చేశాడు. రెండో సీడ్‌ కార్లోస్‌ అల్కరాస్‌ 6-3, 6-1తో డానియల్‌ను మట్టికరిపించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. లొరెంజో ముసెటి 6-3, 6-3తో సహచర ఆటగాడు మాటో బెరాటినిపై సాధికారిక విజయం సాధించాడు. మూడు బ్రేక్‌ పాయింట్లతో అదరగొట్టిన ముసెటి.. మెరుపు విజయంతో క్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెట్టాడు.
క్వార్టర్స్‌లో బోపన్న జోడీ : 45 ఏండ్ల వయసులో అదిరే విజయాలు సాధిస్తూ ఏటీపీ రికార్డు పుస్తకాలను తిరగరాస్తున్న భారత వెటరన్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న మోంటోకార్లో మాస్టర్స్‌ పురుషుల డబుల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రీ క్వార్టర్‌ఫైనల్లో ఇటలీ ఆటగాళ్లు సిమెనె, ఆండ్రీవలపై బెన్‌ షెల్టన్‌ (అమెరికా)తో కలిసి 2-6, 7-6(7-4), 10-7తో రోహన్‌ బోపన్న విజయం సాధించాడు.

Spread the love