– షూటింగ్ వరల్డ్‌కప్ 2025
లిమా (పెరూ): భారత యువ షూటర్, అర్జున్ బబుత ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ రెండో అంచె పోటీల్లో రజత పతకం సాధించాడు. పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో 0.1 పాయింట్ వ్యత్యాసంతో అర్జున్ పసిడి పతకం చేజార్చుకున్నాడు. ఒలింపిక్ చాంపియన్, చైనా షూటర్ షెంగ్ లివో 252.4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి, పసిడి పతకం సొంతం చేసుకోగా.. అర్జున్ బబుత 252.3 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. హంగరీ షూటర్ పెని 229.8 పాయింట్లతో కాంస్య పతకం సాధించాడు. ఇదే విభాగంలో పోటీపడిన రుద్రాక్ష్ పాటిల్ 11వ షాట్ టెక్నికల్ ఎర్రర్‌తో పతక పోటీకి అర్హత సాధించలేదు. తొలి దశ ఎలిమినేషన్‌లోనే నిష్క్రమించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో నాల్గో స్థానంలో నిలిచి పతకం చేజార్చుకున్న అర్జున్ బబుత.. ప్రపంచకప్‌లో గురి తప్పలేదు.