– మెడికల్ బోర్డు ప్రక్రియలో మోసగాళ్లకు చెక్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి మెడికల్ బోర్డులో అక్రమాలను నిరోధించేందుకు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)తో ఒప్పందం చేసుకున్నామని సింగరేణి సీఎమ్‌డీ ఎన్ బలరాం తెలిపారు. కొందరు వ్యక్తులు మెడికల్ బోర్డు పేరుతో ఉద్యోగులను మోసం చేస్తున్నారనీ, వాటి ఆటలు కటిస్తామని హెచ్చరించారు. ఎవరూ అలాంటి మోసగాళ్ల బారిన పడొద్దని కోరారు. మంగళవారంనాడాయన ఏసీబీ డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిశారు. ఈ సందర్భంగా సింగరేణి మెడికల్ బోర్డు పేరుతో కొందరు వ్యక్తులు ఉద్యోగులను మోసం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. తమ మెడికల్ బోర్డుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. అక్రమాలకు ఉద్యోగులే పాల్పడితే వారిని సర్వీస్ నుంచే తొలగిస్తామని హెచ్చ రించారు. సంస్థ విజిలెన్స్ విభాగం కూడా మెడికల్ బోర్డుపై నిఘా ఉంచుతుందన్నారు. సంస్థలోని కార్మికులను అన్‌ఫిట్ చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే, వారి సమాచారాన్ని ఏసీబీ దృష్టికి తీసుకురావాలని కోరారు. పారదర్శకంగా సింగరేణి మెడికల్ బోర్డు ప్రక్రియ నిర్వహిస్తామన్నారు.