– జూలూరుపాడు టన్నెల్ పనులను ప్రారంభించాలి
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి ప్రాంతానికి సాగునీరు అందించే సీతారామ ఎత్తిపోతల పథకానికి చెందిన సత్తుపల్లి ట్రంక్ కెనాల్ ప్యాకేజీలు 9, 10, 11, 12 పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో వీరిద్దరి మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రాజెక్టు పురోగతి, భూసేకరణ, పెండింగ్ బిల్లులపై సుదీర్ఘంగా చర్చించారు.
అక్టోబర్ చివరి నాటికి బేతపల్లి రిజర్వాయర్ కు గోదావరి నీళ్లు
భూసేకరణ సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్యాకేజీలు 9, 10 పనులను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేసి, బేతుపల్లి రిజర్వాయరుకు నీటిని విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. ప్యాకేజీలు 11, 12 పనులను మే 2027 నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు. ప్యాకేజీల పనులకు సంబంధించి నిలిచిపోయిన బిల్లులను ప్రాధాన్యతా క్రమంలో చెల్లించేందుకు నీటిపారుదల శాఖ మంత్రి హామీ ఇచ్చారు.
పైప్ లైన్ ఇరిగేషన్ విధానాన్ని పరిశీలించాలి
అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్యాకేజీలు 7, 8లలో సంప్రదాయ ఓపెన్ కెనాల్ వల్ల 2,500 ఎకరాల భూసేకరణ జరిగి రైతులకు నష్టం జరుగుతుందని, ఆయిల్ పామ్, వాణిజ్య పంటల భూములను కాపాడేందుకు పైప్‌లైన్ ఇరిగేషన్ విధానాన్ని పరిశీలించాలని తుమ్మల కోరగా, ఉత్తమ్ సానుకూలంగా స్పందించారు.
జూలూరుపాడు టన్నెల్ పనులను ప్రారంభించాలి
పాపకొల్లు గ్రామంలో 155 ఎకరాల భూసేకరణ సమస్యను పరిష్కరించి జూలూరుపాడు టన్నెల్ పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు తుమ్మల వచ్చే వారం జూలూరుపాడు ప్రాంతంలో పర్యటించనున్నారు.
సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేయాలి
ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ కాలువల పరిధిలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, పంప్ హౌస్‌లకు విద్యుత్ వ్యయాన్ని తగ్గించే ప్రతిపాదనపై అధ్యయనం చేయడానికి కన్సల్టెంట్‌ను పంపుతామని ఉత్తమ్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఎస్. శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ కాంట్రాక్టింగ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.



