– మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరా బాద్‌లోని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళా కూలీల రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆరు గ్యారంటీల్లో మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలనీ, రూ. 500లకే గ్యాస్‌సిలిండర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబపోషణ చూసుకుంటూ పురుషులతో సమానం గా పనిచేస్తున్న మహిళలకు కూలీ చెల్లింపుల్లో వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంక ట్రాములు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి హామీ పథకం వరం లాంటిదన్నారు. పోరాడి సాధించుకున్న ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ చట్టానికి రూ. 86వేల కోట్లు కేటాయించడం సరైందికాదన్నారు. రెండువందల రోజులు పనులు కల్పించాలనీ, రోజు కూలీ రూ. 600లు చేసిందన్నారు. అటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా తీసుకొచ్చిన ‘పర్యవేక్షణ’ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలులో ప్రజలు పెట్టుకున్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెంకటరాజ్యం, స్వరూప, సరోజ, స్వరాజ్యం, కుమారి, శివలీల, జయమ్మ, సమ్రిన్ తదితరులు పాల్గొన్నారు.