పాదచారుల కోసమే స్కై వాక్‌లు

– ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌…ఉప్పల్‌లో స్కై వే, కన్వెన్షన్‌ హాల్‌ ప్రారంభం
నవతెలంగాణ-ఉప్పల్‌
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్‌ నగరంలో స్కైవాక్‌ల నిర్మాణం చేపడుతున్నట్టు ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సోమవారం ఉప్పల్‌ చౌరస్తాలో స్కై వాక్‌, నాగోల్‌ శిల్పారామంలో కన్వెన్షన్‌ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప్పల్‌ చౌరస్తాలో నాగోల్‌, వరంగల్‌, హబ్సిగూడ వైపు నుంచి వచ్చే వాహనాల రద్దీ వల్ల పాదచారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారన్నారు. ఇప్పుడు ఈ చౌరస్తాలో స్కై వాక్‌ నిర్మాణం వల్ల పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు వీలుగా ఉందని తెలిపారు. ఈ స్కై వాక్‌ను మొత్తం 660 మీటర్ల నిర్మాణంలో రూపొందించామని తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేకంగా లిఫ్ట్‌ సౌకర్యం, ఎక్సలేటర్‌తో ఆరు ఎంట్రీలు, ఆరు ఎగ్జిట్‌లను హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉప్పల్‌ నియోజకవర్గంలో రూ.453 కోట్లతో తాగునీటికి ట్యాంకులు, పైప్‌ లైన్‌లు వేశామని, మిగతా 5 శాతం పనులు త్వరలో పూర్తి చేయనున్నామని చెప్పారు.
70 కిలోమీటర్ల మేర ఉన్న మెట్రో రైలు మార్గాన్ని పెంచుతామనీ, శంషాబాద్‌ వరకు మరో 31 కిలోమీటర్ల మార్గాన్ని రెండున్నరేండ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. ఉప్పల్‌
పాదచారుల కోసమే స్కై వాక్‌లు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2084 మందికి డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కేటాయించామని, కొల్లూరులో 4 వేల మందికి అలాట్‌ చేసి ఆరుగురితో గృహప్రవేశం చేయించామని తెలిపారు. త్వరలో ఉప్పల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను లబ్దిదారులకు అందజేస్తామన్నారు. రూ.88 కోట్లతో స్ట్రామ్‌ వాటర్‌ డ్రెయిన్‌ను రామంతపూర్‌ పెద్ద చెరువు నుంచి హబ్సిగూడ వరకు నిర్మించామని పేర్కొన్నారు. అలాగే నారపల్లి నుంచి ఉప్పల్‌ వరకు నిర్మించే ఫ్లైఓవర్‌ కోసం జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం రూ.350 కోట్లతో భూసేకరణ పనులు చేపట్టిందని చెప్పారు. ఉప్పల్‌-అంబర్‌పేట ఫ్లైఓవర్‌ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉప్పల్‌, రామంతపూర్‌లో పేదవారి కోసం మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ నిర్మించామని, మిగతా 10 డివిజన్లలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దుబారు నుంచి రూ.3,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ఫ్రెంచ్‌ కంపెనీలు ఉప్పల్‌, ఘట్కేసర్‌లో తమ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నాయని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చూసి దేశం మొత్తం కేసీఆర్‌ లాంటి నాయకుడిని కోరుకుంటుందని అన్నారు. ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఉప్పల్‌ చౌరస్తాలో రూ.25 కోట్లతో స్కై వాక్‌, రూ.10 కోట్లతో నాగోల్‌ శిల్పారామంలో కన్వెన్షన్‌ హాల్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. రామంతాపూర్‌ పెద్ద చెరువు నుంచి మూసి వరకు నాలా నిర్మాణం వల్ల 50 కాలనీలు వరద ముంపు నుంచి ఉపశమనం పొందాయని తెలిపారు. రూ.4 కోట్లతో మల్లాపూర్‌ గ్రేవ్‌ యార్డ్‌ను నిర్మించి, మల్లాపూర్‌ చౌరస్తాను ఎలిఫెంట్‌ చౌరస్తాగా సుందరీకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌ రెడ్డి, పీర్జాదిగూడ మేయర్‌ జక్క వెంకట్‌ రెడ్డి, దమ్మాయిగూడ చైర్మెన్‌ వసుపతి ప్రణీత గౌడ్‌, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, బండారి లక్ష్మి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love