– సమాచార ఉపగ్రహ ప్రయోగాలలో అరుదైన ప్రయోగం…
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో శాస్త్రవేత్తలు మరో అత్యంత కీలకమైన ఉపయోగాత్మకమైన ఉపగ్రహాన్ని శనివారం ప్రయోగించి ఘనవిజయం సాధించారు. తిరుపతి జిల్లా శ్రీహరి కోటలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి జీఎస్‌ఎల్‌వీ- ఎఫ్ 14 రాకెట్ ద్వారా ఇన్‌శాట్ 3డీఎస్ పేరుతో సమాచార సేవలకు ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. 2275 కిలోలు బరువు ఉన్న కనీసం 10 సంవత్సరాల పాటు దేశానికి సేవలు అందిస్తుందని అనుకుంటున్న ఇన్‌శాట్ 3 డీఎస్ బహుళ ప్రయోజనాల కోసం రూపొందించబడింది. ఇప్పటికే భారత్ ఎన్నో ఇన్‌శాట్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చి ఉంది. అయితే వాటిలో కొన్నికాలం తీరాయి. మరికొన్ని ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి చేరలేకపోయాయి. గతంలో భారీ ఉపగ్రహం ఇన్‌శాట్ 3డీని అనుకున్న కక్ష్యలోకి చేర్చలేకపోయినా శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఇన్ శాట్ 3డీఎస్ పేరుతో సరికొత్తగా శాటిలైట్‌ను రూపొందించి ప్రయోగించారు. ఈ ఉపగ్రహ నిర్మాణం కూడా కొత్త డిజైన్‌తో రూపొందించారు. జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ) సిరీస్‌లో ఇప్పటికీ 15రాకెట్లను శ్రీహరికోట నుంచి ప్రయోగించి ఉన్నారు. 2000 కిలోలకు పైగా ఉపగ్రహాలను అలవోలుగా అంతరిక్షంలోకి చేర్చగలిగే సామర్థ్యం కలిగిన ఈ తరహా రాకెట్లలో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అయితే ఇటీవల జిఎస్‌ఎల్వీ ప్రయోగాలు కూడా మన సాంకేతిక పరిజ్ఞానంతోనే రూపొందించబడి విజయవంతమయ్యాయి.