ముంచెత్తి‌న న‌కిలీ ప‌త్తి విత్త‌నాలు

Soaked fake cotton seeds– ఇప్పటికే క్వింటాళ్ల కొద్దీ పట్టుకున్న పోలీసులు
– దొడ్డిదారిన పల్లెలకూ నకిలీ ప్యాకెట్లు
– బైక్‌లు, ఎద్దుల బండ్లపై తరలింపు

– పోలీసుల తనిఖీల్లో నిషేధిత బీటీ-3పత్తి విత్తన ప్యాకెట్లు
– మరోవైపు డిమాండ్‌ ఉన్న పత్తివిత్తన ప్యాకెట్ల కృత్రిమ కొరత
– వ్యాపారుల మాయాజాలంతో ధరలు పైపైకి..
– పలుచోట్ల వ్యవసాయాధికారుల నిర్లక్ష్యం.. నష్టపోతున్న రైతులు
వ్యాపారులు మాయాజాలం సృష్టిస్తున్నారు. ఓ వైపు డిమాండ్‌ ఉన్న పత్తి విత్తన ప్యాకెట్ల కృత్రిమ కొరత ఏర్పడేలా చేస్తుండగా.. మరోవైపు నకిలీ విత్తనాలు సరిహద్దులు దాటి రాష్ట్రంలో రైతుల చెంతకు చేరుతున్నాయి.. ప్రతి ఏడాదిలాగే నకిలీ విత్తనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు, పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి క్వింటాళ్ల కొద్దీ నకిలీ విత్తనాలను పట్టుకుంటున్నా.. కొత్త దారుల్లో అవి రవాణా అవుతూనే ఉన్నాయి. నిషేధిత బీటీ-3 సహా ఊరూ పేరూ లేకుండా నకిలీ ధ్రువీకరణ వివరాలతో ముద్రించిన పత్తి విత్తనాలు సరి’హద్దు’లు దాటి రాష్ట్రంలోని కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాలకు చేరాయి. ప్రధానంగా గుజరాత్‌, మహారాష్ట్ర నుంచి అక్రమార్కులు ఈ నకిలీ విత్తన ప్యాకెట్లను మంచిర్యాల, అటు ఆదిలాబాద్‌ బార్డర్లు దాటిస్తున్నారు. అక్కడి నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. అనుమానం రాకుండా బైక్‌లపైనా, ఎడ్ల బండ్లపైనా తరలిస్తున్నారు. విశ్వసనీయ, పక్కా సమాచారంతో పోలీసులు చేసే తనిఖీల్లో పట్టుబడుతున్న పత్తివిత్తన ప్యాకెట్లే క్వింటాళ్లలో ఉంటుంటే.. వారి కండ్లుగప్పి పల్లెలకు చేరిన విత్తనాలు ఏ స్థాయిలో ఉంటాయో బేరీజు వేసుకోవచ్చు. ఇదిలా వుంటే… డిమాండ్‌ ఉన్న పత్తి విత్తన ప్యాకెట్ల కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు తమ మాయాజాలంతో ధరలు అమాంతం పెంచుతూ బ్లాక్‌లో విక్రయిస్తూ రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పలుచోట్ల వ్యవసాయాధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. దీంతో దళారీలు ఆడిందే ఆటగా తయారైంది. నకిలీ విత్తనాల విక్రయాలు రాష్ట్రంలో బహిరంగంగా జరుగుతున్నా పట్టుబడింది కొద్దిగా మాత్రమే. ఇంకా కోట్ల రూపాయల విత్తనాలు లక్షలాది మంది రైతులకు అంటగట్టినట్టు తెలిసింది.
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో పత్తి సాగు చేసేందుకు రైతులు విత్తనాల కోసం దుకాణాలకు వెళ్తే తాము కోరుకున్న కంపెనీలవి ఎమ్మార్పీకన్నా అధిక ధర పెట్టాల్సి వస్తోంది. ఎక్కువ మంది ఒకే రకం విత్తనాలు అడుగుతుండటంతో వ్యాపారులు పత్తి విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తూ కర్షకులను ఆగం చేస్తున్నారు. నో స్టాక్‌ బోర్డులు పెడుతున్నారు. అవే రకం కావాలని రైతులు బతిమిలాడితే ఎక్కువ ధరకు తెప్పించగలమని నమ్మించి రెట్టింపు కన్నా అధిక ధర వసూలు చేస్తున్నారు. రూ.860కి లభించే విత్తనాల ప్యాకెట్‌ను రూ.1600కు అమ్ముతున్నారు. కొన్ని చోట్ల కొన్ని కంపెనీల విత్తనాల ధర రూ.2 వేల వరకు పలుకుతోంది.
గతేడాది రూ.14వేలు పలికిన క్వింటా పత్తి..
పదేండ్ల కిందటి సాగు కంటే ప్రస్తుతం పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిందనే చెప్పొచ్చు. రాష్ట్రంలో ఈసారి 60లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా. ధర ఎక్కువ ఉండటంతో రైతులు పత్తిపైనే మక్కువ చూపారు. ప్రభుత్వం 1.20కోట్ల విత్తనాల ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది. అయినా నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు గుజరాత్‌, మహారాష్ట్ర నుంచి దళారుల ద్వారా రైతులకు చేరడం గమనార్హం. ఉదాహరణకు.. 2014కంటే ముందు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు 4లక్షల ఎకరాల్లో సాగైన పత్తి నేడు కనీసం లక్షా 50వేల ఎకరాలు కూడా దాటడం లేదు. అందుకు కారణాల్లేకపోలేదు. సాగునీటి రంగం అభివృద్ధి చెంది ప్రస్తుతం మెట్ట ప్రాంతాల్లో కూడా నీటి లభ్యత పెరిగింది. దీంతో ఒకప్పుడు 3లక్షలు కూడా సాగవని వరి సాగు విస్తీర్ణం నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12లక్షల వరకు సాగవుతోంది. దీంతో ఉన్న కొద్దిపాటి విస్తీర్ణంలోనే పత్తి వేస్తున్నారు. అయితే, 2022 నుంచి పత్తి క్వింటా ధర అమాంతం పెరిగింది. గతంలో క్వింటా పత్తి రూ.4వేల నుంచి రూ.6వేలు కూడా పలికేది కాదు. 2022లో ఏకంగా రూ.18వేలకు క్వింటా పత్తిని వ్యాపారులు కొనుగోలు చేశారు. గతేడాది రూ.14వేల వరకూ పలకడంతో ఈ ఏడాది పత్తి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు విత్తనాల కృత్రిమ కొరత సృష్టించడం, అడ్డదారుల్లో నిషేధిత బీటీ -3 పత్తి విత్తన ప్యాకెట్లు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని తెలిసింది.
వరి విత్తనాలూ సక్రమమేనా?
గతంలో మానకొండూర్‌ సీడ్స్‌ కంపెనీలో నిర్వహించిన తనిఖీల్లో వరి విత్తనాల నిల్వలో 796 బ్యాగుల తేడా రాగా.. హజూరాబాద్‌ మండలం సింగాపూర్‌ సీడ్‌ప్లాంట్‌లో 350 క్వింటాళ్లను రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో కేసులు నమోదు చేశారు. దమ్మక్కపేట సమీపంలోని సీడ్‌ ప్లాంట్‌లో విత్తన ధ్రువీకరణ లేకుండా గతంలో జారీ చేసిన లేబుళ్లు(ట్యాగులు) అంటించి విత్తన సంచులను మార్కెటింగ్‌ చేస్తున్నట్టు తేలింది. జేజీఎల్‌కు సంబంధించి జారీ చేసిన లేబుళ్లను బీపీటీ విత్తన సంచులకు వినియోగించడం అధికారుల పర్యవేక్షణ తీరును చాటుతోంది. ఈ పరిస్థితులను చూస్తుంటే వరి విత్తనాలు కూడా సక్రమమేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
దుర్షేడ్‌ తనిఖీల్లో 60కిలోల పట్టివేత
ఈనెల 7న పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు కరీంనగర్‌ రూరల్‌ మండలం దుర్షేడ్‌ గ్రామంలో కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌బ్రాంచ్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా వారం గ్రామంలో నివాసం ఉంటున్న చందు నాగేశ్వరరావు తన బైక్‌పై రూ.1.20లక్షల విలువజేసే 60కేజీల నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తుండగా పట్టుకున్నారు.
ఎడ్ల బండిపై తరలిస్తూ..
ఈ నెల 5న రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల జిల్లా వేమనపల్లి ఫెర్రీ పాయింట్‌ వద్ద ఎద్దుల బండిపై తరలిస్తున్న 2.5క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు, స్థానిక మండల వ్యవసాయాధికారితో కలిసి పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి సిరోంచ నుంచి సుమారు రూ.6.75లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు రాష్ట్ర సరిహద్దులు దాటాయన్న పక్కా సమాచారం మేరకు నిందితులను అరెస్టు చేశారు.
అనుమానం వచ్చి తనిఖీ చేయగా..
నమ్మదగిన సమాచారం మేరకు రామగుండం పోలీసు కమిషరేట్‌ పరిధిలోని సీపీ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌, ఎస్‌ఐ లచ్చన్న తన సిబ్బందితో మంచిర్యాల జోన్‌లోని హాజీపూర్‌ పరిధిలోని ముల్కల వద్ద తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి మంచిర్యాల వైపుగా బైక్‌పై సంచులతో ఇద్దరు వస్తుండగా అనుమానం వచ్చి తనిఖీ చేయగా సంచుల్లో రూ.1.80లక్షల విలువజేసే 60కిలోల నకిలీ పత్తి విత్తనాలను గుర్తించారు.

Spread the love