ప్రజాప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట
అభివృద్ధి చెందిన
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం : బాలామృతం ప్లాంట్ ప్రారంభోత్సవంలో
సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో/నాచారం
పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్ అని, పిల్లల ఆరోగ్యం, వారికి పోషకాహారం, మహిళల ఆర్థిక సాధికారతకు రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం నాచారంలో ఉన్న తెలంగాణ ఫుడ్స్‌లో 21 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన నూతన ‘బాలామృతం’ ఉత్పత్తి కేంద్రాన్ని మంగళవారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన ఆరోగ్య తెలంగాణను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. గర్భిణులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు ఇందిరాగాంధీ మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభించిన బాలామృతం పథకం అంచెలంచెలుగా పరిశ్రమగా ఎదిగి పొరుగు రాష్ట్రాలకు కూడా సరఫరా చేసే స్థాయికి చేరుకుందని చెప్పారు. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ నుంచి మంత్రి సీతక్క వరకు ఎంతో మంది మహిళలు రాజకీయాల్లో రాణిస్తారని, మహిళలను కేవలం గృహ నిర్వహణకే పరిమితం చేయకుండా ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో భాగస్వాములను చేస్తామని అన్నారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.60 వేల కోట్ల బ్యాంక్ లింకేజీలు, సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం పోషకాహార భోజనం ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకాల అమలుకు విద్యాశాఖపై ప్రతి ఏడాదీ రూ.27 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. భోజన నాణ్యతను పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేసే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాకుండా గర్భిణులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ బాలామృతం కొత్త ప్లాంటును ప్రారంభించుకున్నట్టు తెలిపారు. కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇవి ఓటు బ్యాంకు పథకాలు కాదని, విద్యార్థుల భవిష్యత్ బాగు కోసమే తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరుపైనే కేటాయిస్తున్నామని, హైదరాబాద్ నగరంలో లక్ష ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను స్వయంగా తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శప్రాయ ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ ఫహీమ్, టీఎస్‌ఐఐసీ చైర్మెన్ నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియంపై మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. మంత్రిగా తనకు సమాచారం ఇవ్వకుండా కడియం శ్రీహరి దేవాదాయ శాఖపరమైన సమీక్ష నిర్వహించారని, ఆయన అలా సమీక్షించడం పరిపాలనా వ్యవస్థకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంకు ఆమె మూడు పేజీల లేఖ రాశారు. దేవాదాయ శాఖ మంత్రిగా అన్ని అధికారాలు తనకే ఉంటాయాన్న సురేఖ.. కడియం శ్రీహరి వ్యవహారంపై పార్టీ, ప్రభుత్వ స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. సోమవారం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. దేవాలయాలకు సమస్య ఉంటే మంత్రి, అధికారులకు వినతిపత్రం ఇవ్వాలి కానీ, సమీక్ష నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ఈ అంశంపై కడియం శ్రీహరి నుంచి వివరణ కోరాలని సీఎం రేవంత్‌రెడ్డికి సురేఖ విజ్ఞప్తి చేశారు.



