– అశ్వారావుపేట అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ సందర్శన..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ నెల 13 వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి ప్రకారం అంతరాష్ట్ర,అంతర్ జిల్లా చెక్ పోస్ట్ లను మంగళవారం జిల్లా ఎస్పీ డా.రోహిత్ రాజు ముమ్మరంగా తనిఖీలు చేశారు. ముందుగా అశ్వారావుపేట అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని చండ్రుగొండ మండలం పెను గడప,దమ్మపేట మండలం మందల పల్లి, అల్లి పల్లి,అశ్వారావుపేట లోని అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను సందర్శించి అక్కడ విధులలో ఉన్న అధికారులు,సిబ్బందికి తగు సూచనలు చేశారు.స్థానిక వ్యవసాయ కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎం ల స్ట్రాంగ్ రూము వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్రమంగా నగదు మద్యం,మాదకద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్బంగా తెలిపారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లాలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు.జిల్లాలో 12 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను,04 అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసారు.ఈ చెక్ పోస్టుల ద్వారా మరియు జిల్లా పోలీసులు చేపట్టిన వివిధ తనిఖీల లో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 1,19,50,531 లు రూపాయల నగదును, రూ.16,37,324 లు విలువ గల 2502 లీటర్ల మద్యాన్ని, రూ.2,06,85,30 ల విలువ గల 828 కేజీ ల గంజాయిని,రూ.11,22,000 ల విలువ చేసే బంగారు,వెండి వస్తువులను స్వాదీనం చేసుకోవడం జరిగిందని వివరించారు.ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం రూ.3,53,95,155 (మూడు కోట్ల యాభై మూడు లక్షల తొంబై ఐదు వేలు) లను స్వాదీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఆయన వెంట పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,అశ్వారావుపేట సీఐ జితేందర్ రెడ్డి,ఎస్సైలు శ్రీనివాస్,శివరామకృష్ణ,దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.