Thursday, June 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇన్‌ సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌

- Advertisement -

ఏటా రెండు సార్లు నిర్వహణ
ఉత్తర్వులు విడుదల…ఉపాధ్యాయ సంఘాల హర్షం


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇన్‌ ‌సర్వీస్‌‌లో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీఎడ్‌, బీఎడ్‌ ‌పూర్తి చేసిన ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం ఏడాదికి రెండుసార్లు రెగ్యులర్ టెట్‌లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇన్‌ ‌సర్వీస్‌‌లో ఉన్న ఉపాధ్యాయుల కోసం అదనంగా మరో రెండు ప్రత్యేక టెట్‌లను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయులు సర్వీస్‌‌లో కొనసాగాలన్నా, పదోన్నతులు పొందాలన్నా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌‌సీటీఈ) నిబంధనల ప్రకారం టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఇన్‌ ‌సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్‌ ‌నిర్వహించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పరిశీలించి ప్రత్యేక టెట్‌ ‌నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఇన్‌ ‌సర్వీసు ఉన్న ఉపాధ్యాయులకు అర్హత సాధించేందుకు అవకాశం కల్పించడం కోసమే ఈ ప్రత్యేక టెట్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై అవసరమైన చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఇన్‌ ‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ ‌నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం ప్రకటించాయి.

​టీఎస్‌‌యూటీఎఫ్ హర్షం
ఇన్‌ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఏడాదికి రెండు సార్లు అదనంగా ప్రత్యేక టెట్‌ ‌నిర్వహించటానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ వెంకట్ హర్షం వ్యక్తంచేశారు. ఏటా నిర్వహించే సాధారణ టెట్ పరీక్షకు అదనంగా ఇన్ సర్వీసు ఉపాధ్యాయుల కోసమే ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలో పేపర్-2 సిలబస్ ను సబ్జెక్ట్ వారీగా నిర్వహిస్తేనే ఉపయోగం ఉంటుందని సూచించారు. టెట్ అర్హత మార్కులు తగ్గించాలనీ, లేదా చేసిన సర్వీసుకు ఐదు నుంచి 20 వెయిటేజ్ మార్కులు ఇవ్వాలనీ లేదా సబ్జెక్ట్ వారీగా ప్రత్యేక టెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రతిపాదనలను ఫిబ్రవరి 9, 12 తేదీల్లో, మళ్లీ ఏప్రిల్ 15న విద్యాశాఖ కార్యదర్శికి, ముఖ్యమంత్రికి, ప్రధాన కార్యదర్శికి వినతిపత్రాలను అందజేశామని గుర్తు చేశారు. కానీ విద్యాశాఖ ఆ ప్రతిపాదనలను విస్మరించిందని పేర్కొన్నారు. ప్రత్యేక టెట్ నిర్వహించాలని టీఎస్‌‌యూటీఎఫ్ తో సహా పలు సంఘాలు ప్రాతినిధ్యం చేసినప్పటికీ అనుమతి ఇచ్చిన ఉత్తర్వుల్లో కొన్ని సంఘాల పేర్లు మాత్రమే పేర్కొనడం భావ్యం కాదని నిరసన వ్యక్తం చేశారు.

​సీఎంకు కృతజ్ఞతలు : ఎస్టీయూటీఎస్‌
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఏడాదికి రెండు ప్రత్యేక టెట్‌ పరీక్షల నిర్వహణపై ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఎస్టీయూటీఎస్ హర్షం చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి సదానందంగౌడ్, జుట్టు గజేందర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు మాదిరిగా తెలంగాణలో కూడా ప్రత్యేక టెట్‌ పరీక్షలను నిర్వహించాలని ప్రాతినిధ్యం చేశామని గుర్తు చేశారు. ఉత్తర్వులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి, విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్‌ ‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ ‌నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల టీపీటీఎఫ్‌ అధ్యక్ష‍, ప్రధాన కార్యదర్శులు అనిల్‌‌కుమార్‌, తిరుపతి, టీఆర్టీఎఫ్‌ అధ్యక్ష‍, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్‌, ఎం అజిరెడ్డి, టీజీహెచ్‌ఎంఏ అధ్యక్ష‍ులు పి రాజభాను చంద్రప్రకాశ్‌, ముఖ్య సలహాదారులు పర్వతి సత్యనారాయణ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -