హైవేల నిర్మాణాలను వేగవంతం చేయండి

హైవేల నిర్మాణాలను వేగవంతం చేయండి– ఎన్‌హెచ్‌ఏఐ చైర్మెన్‌తో మంత్రి కోమటిరెడ్డి భేటి
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో హైవేల నిర్మాణాలను వేగవంతం చేయాలని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ హెచ్‌ఏఐ)ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కోరారు. మంగళవారం ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఏఐ ఛెర్మెన్‌ సంతోష్‌కుమార్‌ యాదవ్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ భేటిలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఇంజనీర్‌ ఇన్‌చీఫ్‌ (ఆర్‌ అండ్‌ బీ) ఐ.గణపతి రెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌లోని రహదారుల సమస్యల పరిష్కారం, పలు జాతీయ రహదారుల మంజూరు గురించి చర్చించారు. పదేండ్లుగా తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం నత్తనడకన సాగడం వల్ల వేలాదిమంది అమాయకులైన ప్రజలు చనిపోతున్నారని చైర్మెన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల పెండింగ్‌ ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు.. వెంటనే జాతీయ రహదారుల నిర్మాణానికి గ్రీన్‌ సిగల్‌ ఇవ్వాలని కోరారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ – విజయవాడ ఎన్‌హెచ్‌-65 నిర్మాణ పనులను ఆరు లేన్లుగా నిర్మించాలని సూచించారు. ఎన్‌ హెచ్‌-163 (హైదరాబాద్‌ – మన్నెగూడ) కు ఉన్న ఎన్జీటీ సంబంధిత సమస్యకు సత్వర పరిష్కారాన్ని చూపి, ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్న నాలుగు లేన్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని కోరారు. అధిక రద్దీతో తీవ్ర ప్రమాదాలకు కారణమవుతున్న ఎన్‌ హెచ్‌ -765 (హైదరాబాద్‌ – కల్వకుర్తి) రోడ్డును నాలుగు లేన్లుగా నిర్మించేందుకు కావాల్సిన డీపీఆర్‌ తయారీ ప్రక్రియని వేగవంతం చేయాలని కోరారు.
కిషన్‌ రెడ్డితో మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి భేటి
కేంద్ర కేబినేట్‌ మంత్రి కిషన్‌ రెడ్డిని మంగళవారం రాష్ట్ర మంత్రులు కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసారు. తెలంగాణ నుంచి మరో సారి కేంద్ర కేబినేట్‌లో చోటు దక్కించుకున్నందుకు అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిలో సహకారం అందించాలని కోరారు. అయితే, మంత్రుల విజ్ఞప్తిపై స్పందించిన కిషన్‌ రెడ్డి, రాష్ట్ర అవసరాల విషయంలో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

Spread the love