వస్తు నిష్ఠతో ‘తదేక’

కవిగా పరిచయమైన హసేన్‌ ఇప్పుడు ఇరవై ఒకటి సాహిత్య వ్యాసాలతో, తానెన్నుకున్న గ్రంథ సమీక్షలతో సమకాలీన సాహిత్య ప్రక్రియలపై తనదైన ఒక అభిప్రాయాన్ని, దక్పథాన్ని’తదేక’ ద్వారా వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంపుటిలో ప్రస్తావించిన రచయితల సాహిత్య నేపథ్యం, రచనా వస్తువు పై విషయ విశేషణాలను పరిచయం చేయడం వంటి లక్షణాలు విమర్శకుడికి సాహిత్యం పై గల అభిరుచికి, నిబద్ధతకు నిదర్శనం. శ్రీ శ్రీ అభ్యుదయపు ఆలోచనలు, విప్లవ భావాలు, కష్ణశాస్త్రి భావకవిత్వ ధార, సినారె కవిత్వంలోని మానవతావాదం , తిలక్‌ కవిత్వంలోని రసాభివ్యక్తీకరణ, శేషేంద్ర శర్మ రచనల విశ్లేషణతో ఈ తరం యువ కవులకు, ముందు తరం కవుల సాహిత్యాన్ని తిరిగి పరిచయం చేసినట్లు అవుతుంది. అప్పటి సాహితీ మూర్తుల రచనలే గాక ప్రవీణ్‌ రెడ్డి లాంటి ఈ తరం యువ రచయితల రచనల పై కూడా సమీక్షలు అందించారు. తెలుగు సాహిత్యంలో దళిత, మైనారిటీ వాదం, స్త్రీ వాద ధోరణులపై, అభ్యుదయ కవిత్వోద్యమ ప్రభావంపై చర్చించడం అభినందించదగిన విషయం. గద్దర్‌, అలిశెట్టి, సీతారామశాస్త్రి, ఏనుగు నరసింహారెడ్డి వీరి కవితా స్వరాలతో పాటు మరికొందరి కవిత్వాన్ని స్పర్శించారు. ఈ వ్యాస సంపుటిలోని వ్యాసాల వస్తువు ఎన్నిక, విశ్లేషణ విషయాలను గమనిస్తే హసేన గారికి సాహిత్య విమర్శనారంగం పై గల ఆసక్తి, అధ్యయనం పై అభిరుచి, తపన అభివ్యక్తమవుతున్నాయి. విమర్శకుడిగా ఎదగాలనుకున్న కవికి, రచయితకి, అధ్యయనం ద్వారా విషయ పరిజ్ఞానం, వస్తు విస్తతి, లోతుపై అవగాహన కలిగి వ్యక్తీకరణలో స్పష్టత వస్తుంది. ఆ ప్రయత్నం ఈ సంపుటిలో కనబడుతుంది. ‘తదేక’లోని వ్యాసాలు ఎలాంటి అస్పష్టతలు లేకుండా సరళమైన భాషలో సాగుతూ పాఠకుడిని చదివిస్తాయి.
– డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌, 99088 40186

Spread the love