ఓటరు సోయి

కలర్‌ ఫుల్‌ హామీలతో- గ్యారంటీల మాటలు
ఎన్నికల్లో కడుతున్నరు -ఎరవేసే కోటలు
ఇన్నేళ్లుగా దేశాన్ని-ఇష్టరీతి ఏలినోళ్లు
అభివృద్ధి ప్రణాళిక -అందంగా చూపినోళ్లె
అమలు చేసే చిత్తశుద్ధి – అసలు లేనే లేనోళ్లు
సోయితప్పి గెలిపిస్తే- చింతించుడే ఐదేళ్లు ||కలర్‌||
ప్రతీ సారి ఎన్నికల- మ్యానిఫేస్టో ప్రకటిస్తరు
ఆకర్షించే హామీలతో- అందరికీ పంచేస్తరు
సింగిడిలా గెలుపువరకే- చెమక్‌ చెమక్‌ మెరిపిస్తరు
ఆపైనా అందకుండా-అల్మారాల్లో దాచేస్తరు ||చురక||
వికసించని అభివృద్ధిని-విస్తృతంగా చాటేస్తరు
అరచేతిలో వైకుంఠం-అధ్భుతంగా చూపిస్తరు
ఇంద్రజాల ప్రదర్శన-ఇష్టరీతి మురిపిస్తారు
కులం మతం డబ్బు తోని-కౌగిలించి వాటేస్తరు ||కలర్‌||
నక్కి నక్కి నాచుబెట్టి- నిజంగానే బోర్లేస్తరు
నమ్మి వాళ్ల గెలిపిస్తే- నిప్పులపై బోర్లిస్తరు
కళ్లముందే మాయ భ్రమల- కాంతి తెరలు కప్పేస్తరు
మోసపోయి చిక్కుకుంటె-మొత్తానికే ముంచేస్తరు ||కలర్‌||
అన్ని నేడు ఓట్లకొరకు – అబద్దాల విచిత్రాలే
ఎన్నికల ప్రచారాల్లో -ఎన్నెన్నో సచిత్రాలే
ఎవరేమిటో ఇన్నేళ్లు-ఎరుకలేదా అందరికి
సందిగ్ధం ఎందుకింకా- సాగరాదా ముందరికి ||కలర్‌||
అడుగడుగున నేరస్థులు- అవినీతి స్వార్థపరులు
అందరిని పీడించి-అణగదొక్కె బలవంతులు
దేశంలో కొదవలేరు-దేశ సేవ గుణవంతులు
మరిదేనికి ఎన్నికల్లో-మనలదోచే ధనవంతులు ||కలర్‌||
వ్యక్తి కేంద్ర రాజకీయ- వ్యవస్థీకత పరిపాలన
ప్రమాదమే చేయకుంటె- ప్రజలు ఇంకా ప్రక్షాళన
రాజరికం మరో రూపే- రాజ్యమేలుతుంటది
ప్రజాస్వామ్య నిర్మాణం- పగిలి కూలుతుంటది ||కలర్‌||
– వేల్పుల నారాయణ, 9440433475

Spread the love